సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ముఖ్య నాయకులు బుధవారం రాహుల్‌గాంధీని కలవనున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు 10 జన్‌పథ్‌లో కలవాలని సోమవారం రాత్రి ఏఐసీసీ నుంచి 10 మంది టీపీసీసీ నేతలకు ఫోన్‌లు వచ్చాయి. దీంతో మంగళవారం సాయంత్రం అందరూ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి ఆహ్వానం అందిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, అజారుద్దీన్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
ఒక్కొక్కరితో 5 నిమిషాల చొప్పున రాహుల్ సమావేశమవుతారని, కొత్తగా ఎంపికైన నేతలను పరిచయం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితిపై వారితో మాట్లాడతారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. కొత్తగా పీసీసీ అధ్యక్షుడిగా, ఇతర ముఖ్య పదవుల్లో నియమితులైన వారితో రాహుల్ లేదా సోనియా భేటీకావడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే రాష్ట్ర నేతలకు ఆహా్వనం అందిందని తెలుస్తోంది.
ఢిల్లీ టూర్‌కు జగ్గారెడ్డి నో...
రాహుల్‌తో భేటీకి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెళ్లడం లేదు. అనుకోకుండా ఆహా్వనం రావడం, విమానం ఎక్కే అలవాటు లేకపోవడం, రైలులో వెళ్లే సమయం లేకపోవడంతో జగ్గారెడ్డి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్‌ను కలిసేందుకు మరోమారు తన కుటుంబ సభ్యులతో కలసి వస్తానని కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్‌కు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment