సాక్షి, ఢిల్లీ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఆగలేదని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. దీనిలో భాగంగానే కొత్త, పాత నాయకులను సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉన్నోళ్లను కాపాడుకునేందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ చెప్పుకుంటోందని మహేష్‌కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్‌లో మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు.
‘కేటీఆర్‌తో సన్నిహితంగా ఇన్ అండ్ ఔట్ ఉన్నవాళ్లే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. జీవన్‌రెడ్డి అనుచరుడి హత్యపై విచారణ చేయాలని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ అధిష్టానం, సీఎం చేతుల్లో ఉంది. కేసీఆర్ అవినీతి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆయన చేసిన తప్పులకు కేటీఆర్ రెండు, మూడు ఎల్లుకాదు 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా తక్కువే.కాళేశ్వరం మతలబు ఏంటి? అంత వ్యయం పెట్టి కట్టాల్సిన అవసరం ఏం వచ్చింది. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి. ఇప్పుడు చాలా తక్కువధరకే విద్యుత్ దొరుకుతుంది. విద్యుత్ చార్జీల పెంపు ఆలోచన లేదు. కేసీఆర్‌కు ఉన్న ఆర్థిక వెసులుబాటు మాకు లేదు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉంది.. కానీ 10 ఏళ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేశారు.
తమ ప్రభుత్వం ఏ పథకాన్ని ఆపలేదు. త్వరలోనే పథకాలను గ్రౌండ్ చేస్తాం. గత 10 ఏళ్లలో విడతాల వారీగా చేసిన దాని కంటే మేము రుణమాఫీ చేసిన మొత్తం ఎక్కువ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేసీఆర్ చేసిన అప్పులను ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం. పథకాలని ఎగ్గొట్టే ఆలోచన లేదు. హైడ్రాలో ఒక్కటే పేద వాళ్ల ఇల్లు కూలింది. హైడ్రాపై సోషల్ మీడియాలో అనైతికంగా ప్రచారం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ 10 ఏళ్ల పాలనలో యథేచ్ఛగా చెరువుల కబ్జా జరిగింది. వయనాడ్‌లో జరిగిన విధ్వంసం తెలంగాణ జరగకూడదనే యుద్ధ ప్రాతిపదికన మూసి ప్రక్షాళన చేపట్టాం. విడతల వారీగా మూసీ ప్రక్షాళన చేస్తున్నాం. హైడ్రా తో పేదవారికి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటాం’ అని మహేష్‌గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment