సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బలం పెంచుకునేందుకు పూర్తిగా చేరికపైనే దృష్టి పెట్టారు. వారం రోజుల నుంచి ప్రజా ప్రతినిధులను, నాయకులను రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులపైనే దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ నుంచి చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశంను, మరికొంత మంది నేతలను బీజేపీలో చేర్చుకున్నారు. వారం రోజులుగా పలువురు సర్పంచ్‌లను, వార్డు సభ్యులను, ఇతర పార్టీ కార్యకర్తలను పదుల సంఖ్యలో రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. గత ఆదివారం హైదరాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన చేరికల్లో ఎలుకలగూడెం గ్రామానికి చెందిన 30 మంది , మునుగోడు నుంచి 11 మంది, మరో గ్రామానికి చెందిన 20 మంది బీజేపీలో చేరారు.
అదేవిధంగా చౌటుప్పల్ మండలంలోని అల్లాపురం, అంకిరెడ్డిగూడెం, గుండ్లబావి గ్రామాల సర్పంచ్‌లు బుధవారం రాత్రి హైదరాబాద్‌లో రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. గురువారం ఎల్లంబావి శివారులోని హోటల్ వద్ద కోయలగూడెం, నాగారం, పంతంగి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.
టీఆర్‌ఎస్‌కు షాక్..
ఇటీవల చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ కంగుతింది. దీంతో మిగతా క్యాడర్ పార్టీని వీడకుండా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శవయాత్రలు చేసి వలసలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కర్నాటి వెంకటేశంతోపాటు గట్టుప్పల్‌కు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు అవ్వారు గీతాశ్రీనివాస్, చెరుపల్లి భాస్కర్, ఉడతలపల్లి సర్పంచ్ తులసయ్యలు కూడా బీజేపీలో చేరారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి వలసలు పెరగడంతో మరింత ఉత్సాహంతో బీజేపీ నాయకులు ముందుకు పోతున్నారు.
కార్యాచరణపై నిర్ణయం
మాజీ ఎంపీ వివేక్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి కోఆర్డినేటర్‌గా 14 మంది సభ్యులతో నియమించిన స్టీరింగ్ కమిటీ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయ్యింది. ఈ క్రమంలో మునుగోడులో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం, కమిటీలు చేపట్టాల్సిన కార్యాచరణపై స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment