
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో కత్తులు దూసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో మాత్రం వలపు బాణాలు విసురుకుంటున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో బీజేపీలో కలపడం ఖాయమని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రైస్ మిల్లులతో ఒప్పందం ఉన్నవారు, సొంతంగా అమ్మకం, విత్తనాల కోసం.. వరి సాగు చేసుకోవచ్చని రైతులకు చెప్పాం. కానీ ఎర్రవల్లిలో వరి చూపించి ఏదో ప్రపంచం మునిగిపోయినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో సంబోధించడం సరికాదు. రేవంత్‌రెడ్డికి భూమి ఉంటే ఆయన కూడా వరి వేసుకుంటే ఎవరు వద్దన్నారు’అని నిరంజన్‌రెడ్డి అన్నారు. ‘రైతుల కోసం తెలంగాణ చేస్తున్న ఖర్చులో యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవీ సగం కూడా ఖర్చు చేయడం లేదు. రైతు సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తోంది’అని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్న సమయంలో బండి సంజయ్ దీక్షలు హాస్యాస్పదమని అన్నారు. గతంలో కాంగ్రెస్‌కు టీడీపీని అమ్మివేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్‌ను అమ్మే ప్రయత్నంలో ఉన్నారని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment