
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయవేత్త టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్) త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? ప్రస్తుత పరిణామాలను బట్టిచూస్తే త్వరలోనే ఇది వాస్తవరూపం దాల్చవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గురువారం డీఎస్ నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా డీఎస్‌ను రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా డీఎస్ ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో కేసీఆర్ స్వయంగా డీఎస్ ఇంటికెళ్లి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ తరఫున రాజ్యసభకు పంపించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ టికెట్‌పై నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించారు.
ఆ తర్వాత తనకు తగిన గౌరవం ఇవ్వలేదని, వివిధ ఆరోపణలు చేసి అవమానించారని, డీఎస్ కొంతకాలంగా టీఆర్‌ఎస్‌కు దూరంగానే ఉంటున్నారు. ఇదిలా ఉండగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితులయ్యాక, పార్టీని వీడిన కాంగ్రెస్ సీనియర్‌నేతలను మళ్లీ వెనక్కి రప్పించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా డీఎస్ నివాసానికి వెళ్లిన రేవంత్ ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డీఎస్, సంక్రాంతి తర్వాత ఎంపీ పదవికి, టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment