హుజూరాబాద్‌లో ‘సోషల్‌’ వార్‌కు రెడీ.. | TRS Social Media Team Starts Work On Huzurabad Bypolls | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్‌లో ‘సోషల్‌’ వార్‌కు రెడీ..

Published Sat, Jun 26 2021 8:28 AM | Last Updated on Sat, Jun 26 2021 9:03 AM

TRS Social Media Team Starts Work On Huzurabad Bypolls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎదురైన ప్రతికూలతలు హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పునరావృతం కాకుండా టీఆర్‌ఎస్‌ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా పార్టీపై సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రతికూల ప్రచారం నష్టం చేసినట్లు టీఆర్‌ఎస్‌ గుర్తించింది. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ చురుగ్గా ఉంటూ చేసిన ప్రచారంతో పార్టీ అభ్యర్థి ఓటమి పాలైనట్లు టీఆర్‌ఎస్‌ అంచనా వేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం కొనసాగిందని భావించిన టీఆర్‌ఎస్‌... ఆ తర్వాత జరిగిన మండలి పట్టభద్రుల కోటా ఎన్నికలు, సాగర్‌ ఉప ఎన్నికలో తమ ‘సోషల్‌ మీడియా వింగ్‌’ను అప్రమత్తం చేసి విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టింది.

ఈ నేపథ్యంలో త్వరలో జరిగే హుజూరాబాద్‌ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్‌ఎస్‌... సోషల్‌ మీడియా వేదికగా మరోసారి బీజేపీపై పోరుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలను స్థానిక ఓటర్లకు చేరవేస్తూనే విపక్షాలు ప్రత్యేకించి బీజేపీ సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసే ప్రతికూల అంశాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు సిద్ధమవుతోంది. 

చాప కింద నీరులా సోషల్‌ మీడియా కమిటీలు 
సామాజిక మాధ్యమ వేదికలు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ తదితరాల్లో చురుగ్గా ఉండే యువతను లక్ష్యంగా చేసుకొని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ‘సోషల్‌ మీడియా అవగాహన సదస్సు’ల నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా గతంలో టీఆర్‌ఎస్‌పై బీజేపీ చేసిన ప్రతికూల ప్రచారం ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ సదస్సుల్లో వివరిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ వచ్చే వారం రోజుల్లో పార్టీ కార్యకర్తలు, యువతను భాగస్వాములుగా చేస్తూ గ్రామ, మండల స్థాయిల్లో వాట్సాప్‌ గ్రూప్‌లు, ఇతర సోషల్‌ మీడియా ఖాతాలు తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. మండల, గ్రామస్థాయిలో సోషల్‌ మీడియా కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయం చేసేందుకు ఇన్‌చార్జీల నియామకం కూడా ఒకట్రెండు రోజుల్లో పూర్తికానుంది. సోషల్‌ మీడియాతోపాటు యువత, విద్యార్థుల మద్దతును కూడగట్టేందుకు ఇప్పటికే పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం నాయకులు మండలాలవారీగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. 

రంగంలోకి సోషల్‌ మీడియా వింగ్, టెక్‌ సెల్‌ 
పార్టీ సభ్యులు, కమిటీల డేటా బేస్, పార్టీ వెబ్‌సైట్, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ తదితరాల నిర్వహణతోపాటు ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం తదితర లక్ష్యాలతో గతేడాది టీఆర్‌ఎస్‌ టెక్‌ సెల్‌ ఏర్పాటు చేసింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో రంగంలోకి దిగిన టెక్‌ సెల్‌... బీజేపీ ఎత్తుగడలు, ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేలా వీడియోలు, కార్టూన్లు, స్లైడ్స్‌ తయారు చేయడంపై దృష్టి సారించింది. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ అనుకూల ఖాతాల నుంచి వచ్చే పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటిని తిప్పికొట్టేందుకు, బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపడం లక్ష్యంగా సమాచారాన్ని సిద్ధం చేసుకుంటోంది.  

చదవండి: Huzurabad: బిగ్‌ఫైట్‌కు టీఆర్‌ఎస్‌, బీజేపీ సై.. కానీ కాంగ్రెస్‌ ఎందుకిలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement