సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలకు పట్టుమని నెలరోజులు కూడా లేదు. కానీ, తెలంగాణ బీజేపీ ఇంతవరకు తన మేనిఫెస్టోను ప్రకటించలేదు. దీంతో.. మేనిఫెస్టో లేకుండానే బీజేపీ ఎన్నికలకు వెళ్తుందా? అనే అసహనం పార్టీ కేడర్ వ్యక్తం చేస్తోంది. ఈ అనిశ్చితికి కారణాల్ని పరిశీలిస్తే..
తెలంగాణ బీజేపీలో కమిటీలు ఒక్కోక్కటిగా ఖాళీ అవుతున్నాయి. కమిటీల కన్వీనర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం.. మిగిలిన వాళ్లు కమిటీలకు దూరంగా ఉంటుండడంతో పరిస్థితి దారుణంగా తయారవుతోంది. అక్టోబర్ 5వ తేదీన బీజేపీ మొత్తం 14 ఎన్నికల కమిటీలను ప్రకటించింది. పార్టీలో అసంతృప్తితో ఉన్నవాళ్లకే అందులో ప్రాధాన్యత కల్పించింది. కానీ, నెల తిరగకుండానే సీన్ మారిపోయింది.
- స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్ గూటికి చేరారు
- మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్‌గా నియమించిన గడ్డం వివేక్ వెంకటస్వామి.. రాజగోపాల్ బాటలోనే సొంత గూటికి చేరిపోయారు
- హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ అయిన ఇంద్రసేనారెడ్డికి త్రిపుర గవర్నర్ పదవిని కట్టబెట్టారు
- నిరసనలు, ఆందోళనల కమిటీకి(అజిటేషన్ కమిటీ) చైర్మన్ విజయశాంతి మొదటి నుంచే దూరంగా ఉంటున్నారు
పబ్లిక్ మీటింగ్ కమిటీ ఇంఛార్జ్‌గా బండి సంజయ్ కుమార్, ఛార్జ్‌షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌రావు, ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్ మిగిలిన కమిటీ చైర్మన్‌లు, కో కన్వీనర్‌లు ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రామచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు ఇలా వీళ్లెవరరూ తమ కమిటీల విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు కనబడడం లేదు.
చైర్మన్‌లే పార్టీని వీడడం, పట్టించుకోవడం మాత్రమే కాదు.. కో-కన్వీనర్లు సైతం కమిటీల విషయంలో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మేనిఫెస్టో కో కన్వీనర్ గా ఉన్న మహేశ్వర్ రెడ్డి తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఎస్సీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్ కమిటీ పరిస్థితి దారుణంగా ఉంది. వికారాబాద్, ఆలంపూర్ ఎస్సీ నియోజకవర్గాలకు అభ్యర్థులు కరువయ్యారు. ఆ అభ్యర్థుల్ని వెతుక్కోలేని స్థితిలో కమిటీ ఉండగా.. ఎస్సీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ జితేందర్ రెడ్డి తన పాలమూరు నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇలా.. పనివిభజన చేసుకోలేకపోతున్న కమలనాథుల తీరుపై పార్టీ కేడర్‌లోనే తీవ్ర అసంతృప్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment