సాక్షి, హైదరాబాద్: అమ్మ నుంచి ఎంతో నేర్చు కున్నానని రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు వెల్లడించారు. ఆది వారం బేగంపేట్‌లోని గ్రాండ్ కాకతీయ హోటల్‌లో ఫ్యూచర్ ఫార్వార్డ్ తెలంగాణలో భాగంగా ‘విమెన్ ఆస్క్ కేటీఆర్’ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉండటంతో తన తండ్రితో తక్కువ సమయం గడిపానన్నారు. ‘మా అమ్మని చూసి చాలా నేర్చుకున్నా. నా భార్య కూడా చాలా ఓపికగా ఉంటుంది. నా చెల్లి కవిత చాలా డైనమిక్. మా కుటుంబంలోనే తనంత ధైర్యవంతులు లేరు. నా కూతురు ఇంత చిన్న వయసులోనే చాలా బాగా ఆలోచిస్తుంది. కూతురు పుట్టాక నా జీవితం చాలా మారింది’అని వివరించారు.
మహిళలు మానసికంగా చాలా బలవంతులు..
హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటం గర్వకారణమన్నారు. కోవిడ్ సమయంలో సుచిత్రా ఎల్లా, మహిమా దాట్ల వంటివారు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. మహిళలు మానసికంగా చాలా బలంగా వుంటారని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందించామని, మైనారిటీ పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించామని చెప్పారు.
ప్రతి చిన్నారిపై రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 61 శాతానికి పెరిగాయని తెలిపారు. స్త్రీనిధి కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. తెలంగాణ, ఏపీలో మహిళలు స్త్రీనిధి రుణాలను 99 శాతం తిరిగి చెల్లిస్తున్నారని చెప్పారు. తాము మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాల్లో కొన్నింటిని పూర్తి చేశామని, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని తెలిపారు.
మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, కల్యాణ లక్ష్మి, అమ్మఒడి వంటి సేవలను తెచ్చామని వివరించారు. నెగెటివ్‌బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో రుణాలిస్తామన్నారు.
డీప్ ఫేక్‌తో రాజకీయ నేతలకూ ప్రమాదమే..
కాగా, డీప్ ఫేక్.. మహిళలకు మాత్రమే కాదు.. రాజకీయ నేతలకు సైతం ప్రమాదమేనని చెప్పారు. తమ ప్రత్యర్థులు డీప్ ఫేక్ వాడి దుష్ప్రచారం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఒక్కోసారి టాక్సిక్‌గా తయారవుతోందని, ప్రతిపక్షాలు సోషల్ మీడియాని వాడుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. మాట్లాడే హక్కుని ఎదుటివారిని దూషించడానికి వాడకూడదని స్పష్టంచేశారు.
మహిళకు సంబంధించిన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నామని చెప్పారు. ప్రతి పక్షాలకు కూడా బీఆర్‌ఎస్ పార్టీయే గెలుస్తుందని తెలుసని, కానీ వాళ్లు నటిస్తున్నారని అన్నారు. విద్యావంతులైన మహిళలు రాజకీయంగా కూడా అడుగులు వేయాలని కేటీఆర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment