సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో హ్యాట్రిక్ విజయం లక్ష్యంగా భారత్ రాష్ట్ర సమితి సర్వశక్తులూ ఒడ్డుతోంది. విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, మరో మంత్రి హరీశ్‌రావు ముమ్మర ప్రచారంతో ప్రజల వద్దకు వెళుతున్నారు. పదేళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరించడంతో పాటు, ఎప్పటికప్పుడు విపక్షాల ప్రచారాన్ని అన్నివిధాలా తిప్పికొట్టడం, విమర్శలకు వీలైన అన్ని మార్గాల్లో వివరణ ఇవ్వడం, ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత పెంచే వ్యూహాలను బీఆర్‌ఎస్ అమలు చేస్తోంది.
‘ఎట్లుండె తెలంగాణ.. ఎట్లయింది’
కేసీఆర్ ఇప్పటికే సుమారు 75 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ నెల 25న గ్రేటర్ హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక తాను పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే సభతో కేసీఆర్ ఈ నెల 28న తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. ఇక కేటీఆర్, హరీశ్‌రావులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారు. ప్రచార అంకంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్పీ కూడా ఢిల్లీ నేతలను రంగంలోకి దించడాన్ని బీఆర్‌ఎస్ నిశితంగా గమనిస్తోంది.
బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా తదితరులు.. కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితరులు.. బీఎస్‌పీ తరఫున మాయావతి సైతం ప్రచారంలోకి దిగారు. దీంతో ఢిల్లీ నేతలు చేసే విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్‌ఎస్ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. పదేళ్ల పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, అడ్వర్టయిజ్‌మెంట్ల రూపంలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ‘ఎట్లుండె తెలంగాణ.. ఎట్లయింది’అనే నినాదంతో గతంతో, వర్తమాన పరిస్థితిని పోల్చి చూపిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
మేనిఫెస్టోకు కొత్త హామీల జోడింపు
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సభలు, రోడ్ షోలతో పాటు క్షేత్ర స్థాయి ప్రచారంలో విస్తృతంగా ప్రస్తావిస్తున్న బీఆర్‌ఎస్..ఎప్పటికప్పుడు కొత్త హామీలను కూడా జోడిస్తోంది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, బీడీ కార్మికుల పింఛన్లకు 2023 వరకు కటాఫ్ పెంపు, గల్ఫ్ కారి్మకులకు బీమా, ఆటో కార్మికులకు వెహికల్ ఫిట్‌నెస్ నుంచి మినహాయింపు వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్‌పై జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహాలను ఎప్పటికప్పుడు సిద్ధం చేసే బాధ్యతను పలు ఏజెన్సీలకు అప్పగించారు. ఇక తెలంగాణ, హైదరాబాద్ విషయంలో తమ దార్శినికతను ఆవిష్కరించే క్రమంలో పేరొందిన యూ ట్యూబర్లు, చానెళ్లకు కేటీఆర్, హరీశ్ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
విద్యాధికులు, పట్టణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకునేందుకు వీలుగా సామాజిక మాధ్యమాల్లో పేరొందిన వారికి కూడా ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు కేటీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు మహిళలు, నిరుద్యోగ యువత, మైనారిటీ మహిళలు, అలాగే వివిధ రంగాలకు చెందిన వారితో బీఆర్‌ఎస్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ పలు హామీలు ఇస్తోంది. తద్వారా ఆయా వర్గాల్లో బీఆర్‌ఎస్ పట్ల సానుకూల ధోరణి నెలకొనేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘విమర్శలు.. వివరణలు’అనే వ్యూహాన్ని బీఆర్‌ఎస్ అనుసరిస్తోంది.
పరిస్థితుల సమీక్ష..ఎప్పటికప్పుడు ఆదేశాలు
క్షేత్ర స్థాయిలో పార్టీ అభ్యర్థుల ప్రచారం, కేడర్ నడుమ సమన్వయాన్ని ‘వార్ రూమ్’ల ద్వారా బీఆర్‌ఎస్ నిశితంగా గమనిస్తోంది. నిఘా సంస్థలు, సర్వే ఏజెన్సీలు, వివిధ సంస్థల నుంచి అందుతున్న నివేదికలను లోతుగా విశ్లేషించి నియోజకవర్గాల వారీగా పరిస్థితిని అంచనా వేస్తోంది. కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్పీ వంటి ఇతర పార్టీల ప్రచారం, క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీలు, అభ్యర్థులు పన్నుతున్న వ్యూహాలు, అమలు చేస్తున్న ప్రణాళికలను ఛేదిస్తూ (డీ కోడ్) వాటికి ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈ వ్యూహాల అమలు బాధ్యతను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, అభ్యర్థులకు అప్పగించి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తు న్నారు. అదే సమయంలో పార్టీ అభ్యర్థుల ప్రచార లోపాలను కూడా విశ్లేషిస్తూ దిద్దుబాటుకు అవసరమైన సలహాలు, సూచనలతో తక్షణ ఆదేశాలు జారీ చేస్తున్నారు.
విపక్షాల బలహీనతలపైనా దృష్టి
అధినేత కేసీఆర్ నుంచి అందే ఆదేశాలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిర్వహిస్తున్న టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ అభ్యర్థులు, కేడర్‌కు వివరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్, బీజేపీకి చాలాచోట్ల పటిష్ట పార్టీ యంత్రాంగం లేకపోవడం, చివరి నిమిషంలో టికెట్లు దక్కించుకున్న ఇతర పార్టీల అభ్యర్థులు తడబడుతున్న తీరును తమకు అనువుగా మలుచుకునే వ్యూహాలకు సైతం పదును పెడుతోంది. మరోవైపు క్షేత్ర స్థాయిలో పోల్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. ఒక్కో ఓటును ఒడిసి పట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగేలా కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తోంది.
విజయాలను వివరించి.. విమర్శలను తిప్పికొట్టి..
Published Fri, Nov 24 2023 4:36 AM | Last Updated on Fri, Nov 24 2023 8:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment