కామారెడ్డి పట్టణంలో రోడ్‌షోలో పాల్గొని కార్నర్ మీటింగులో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, కామారెడ్డి/సిరిసిల్ల: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ మూలాలు ఇక్కడే (కామారెడ్డి) ఉన్నాయి. అయినా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అందరికీ లోకలే. కానీ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి కొడంగల్ నుంచి వచ్చారు. బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి పక్క నియోజకవర్గం నుంచి వచ్చారు. అడ్డమైనోళ్లకు, చిటికెడంత లేనోడికి, సన్నాసులకు ఓటేస్తే బతుకులు ఖరాబైతయి’అని మంత్రి కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రం, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలలో పాల్గొనడంతోపాటు సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో జాతీయ మీడియాతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ ఓ చెత్త పార్టీ...: తెలంగాణలో మార్పు కావాలంటున్న కాంగ్రెస్ కొత్త పార్టీ కాదని, అదో చెత్త పార్టీ అని కేటీఆర్ విమర్శించారు. మంచిగా కారు (రాష్ట్రాన్ని) నడుపుతున్న డ్రైవర్ (కేసీఆర్)ను కాదని కాంగ్రెసోళ్లను నమ్మితే.. రాష్ట్రం అధోగతి పాలవుతుందని పేర్కొన్నారు.
సిలిండర్ ధరను మోదీ రూ. 1,200కు పెంచిండు..
‘నరేంద్ర మోదీ ప్రియమైన ప్రధాన మంత్రి కాదు.. పిరమైన ప్రధాన మంత్రి. గ్యాస్ ధరను రూ. 400 నుంచి రూ. 1,200కు పెంచిండు. మోదీ పాలనలో పెట్రోల్, ఉప్పు, పప్పు,నూనె ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే గ్యాస్ సిలింండర్ రూ. 400కే ఇవ్వబోతుండు’అని కేటీఆర్ తెలిపారు.
బీడు భూములకు సాగునీటి కోసమే కేసీఆర్ తపన..
కామారెడ్డిలో రైతుల భూములను గుంజుకుంటారని కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చిల్లర ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆ మాటలు మాట్లాడుతున్న వాళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ‘కామారెడ్డిలో ఏమైనా లంకె బిందెలు ఉన్నయా ’అని ప్రశ్నించారు. ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నారని, కామారెడ్డి ప్రాంతంలో బీడువారిన భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలనేది కేసీఆర్ తపన అని కేటీఆర్ పేర్కొన్నారు.
90 శాతం పనులు చేశాం..
‘సాధించాల్సిది ఇంకా ఉంది. అంతా అయిపోయిందని చెప్పట్లేదన్నారు. పొరపాట్లు జరగలేదని అనట్లేదు.. వాటిని సరిదిద్దుకుంటాం. వచ్చేసారి అన్నీ పూర్తి చేసుకుంటాం. నూటికి 90 శాతం పనులు చేశాం.. మరో 10 శాతం పనులు కూడా చేస్తాం. మాకంటే మెరుగైన వాళ్లు, మంచిగా పనిచేసేవాళ్లు ఎవరున్నారో ప్రజలు ఆలోచించాలి’అని కేటీఆర్ కోరారు.
కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం...
దక్షిణాదిలో వరుసగా మూడోసారి సీఎంగా కేసీఆర్ అరుదైన ఘనత సాధించబోతున్నారని, పూర్తి విశ్వాసంతో ఈ మాట చెబుతున్నానని.. ఈ ఎన్నికల్లో విజయం బీఆర్‌ఎస్‌దేనని కేటీఆర్ జోస్యం చెప్పారు. ‘కేసీఆర్ గెలుసుడు పక్కానే. భారీ మెజారిటీతో గెలవాలంటే దమ్ము జూపాలె.. దుమ్ములేపాలె’అని ఆయన ప్రజలు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మతం పేరుతో బీజేపీ, కులం పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయని, కులం, మతం తిండిపెట్టవన్న విషయాన్ని గుర్తించి మానవత్వం ఉన్న కేసీఆర్‌కు ఓటేయాలని కోరారు.
మహిళల కోసం కేసీఆర్ పడుతున్న తపనను గుర్తించి మహిళలు ఏకపక్షంగా ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే మాయామశ్చీంద్రగాళ్లను, ఫేక్ న్యూస్‌లు, ఫేక్ ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టివ్వడమే తమ లక్ష్యమని, సంపూర్ణ అక్షరాస్యతతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment