సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదు.. కుక్కలు కూడా వారి వెంట పడవు’అని శాసనమండలి సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తీవ్ర వ్యా ఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఉభయసభల సంయుక్త సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఇటీవలి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిపై శాసనసభ ఆవరణలో పిచ్చాపాటిగా మాట్లాడారు. ‘తొక్కుడు రాజకీయాలతోనే బీఆర్‌ఎస్ ఓటమి పాలైంది.
అసలు విషయాలు అధిష్టానం వరకు చేరకుండా మధ్యలోనే కొందరు ఆపేశారు. జోకుడు బ్యాచ్‌కు మా పార్టీ అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాస్తవాలు చెప్పేందుకు అధినేత అవకాశం ఇస్తే ఎవరైనా అసలు విషయం చెప్తారు. వాస్తవాలు చెప్పేవారు బయట, జోకుడుగాళ్లు లోపల ఉంటే వాస్తవాలు ఎలా తెలుస్తాయి. పార్టీ గెలుపుపై ఊహాగానాలు ఎక్కువై వాస్తవాలు మరిచిపోయారు.
2014, 2018 ఎన్నికల్లో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్‌ఎస్‌లోకి లాగితే.. వచ్చిన వారు నిజమైన బీఆర్‌ఎస్ లీడర్లను అణచివేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతీసారి ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్‌ఎస్‌లోకి తెచ్చుకుంటే నేతలు గ్రూపులుగా విడిపో యారు. కొన్ని జిల్లాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో అసహనం పెరిగేలా చేశారు.. దానిని ఎలా మేనేజ్ చేయాలో పార్టీకి ప్రణాళిక లేకపోతే ఎలా గెలుస్తాం.
ఆత్మగౌరవం ఎక్కువగా ఉండే వరంగల్ లాంటి జిల్లాల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. తెలంగాణవాదం, ఉద్యమం గురించి తెలియని వారికి మంత్రి పదవులు ఇస్తే ఎలా..పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమిని అక్కడి ఓటర్లు ఎప్పుడో నిర్ణయించారు. ఆయన జనాలకు చక్కిలిగింత పెట్టడం తప్ప ఎవరికీ రూపాయి సాయం చేయరు’అని రవీందర్‌రావు అన్నారు.
ఆ ప్రచారాన్ని నమ్మొదు
చిట్‌చాట్ పేరిట తాను అనని మాటలను అన్నట్టు గా ప్రచారం జరుగుతోందని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ రవీందర్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వ్యాఖ్యలు చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఏదైనా విషయం మాట్లాడాలని అనుకుంటే అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తానన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌పై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆయన అప్పజెప్పిన అనేక బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చినట్లు పేర్కొన్నారు. చిట్‌చాట్ పేరిట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తక్కెళ్లపల్లి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment