ఈ కూల్చివేతలు న్యాయ, చట్టబద్ధంగా చేసి ఉంటే బావుండేదనేది ప్రజాభిప్రాయం
సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రణాళిక లేకుండానే, హడావుడి చేసి నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతో అక్రమ కట్టడాల పేరిట ఇళ్ల కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలని భావిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అయితే ఈ కూల్చివేతల ప్రక్రియ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని ప్రజల అభిప్రాయమని సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు. హైడ్రా బాధితులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, మేధావుల ఆలోచనలు, నిత్యం వార్తాపత్రికలు, టీవీ చానళ్ల ద్వారా తెలుసుకుంటున్న అంశాలన్నింటితో ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు.
ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తాము సమరి్థంచబోమని, అయితే వీటిపై చర్యలు తీసుకునే సమయంలో సహజ న్యాయ సూత్రాలకు (ప్రిన్సిపుల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్) అనుగుణంగా ఉండాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విషయంలో వీటి ఆధారంగానే పనిచేయాలనేది అందరి అభిప్రాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా కేసుల్లో సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదన్నారు. ఇవాళ అక్రమమని కూల్చేస్తున్న వాటి గురించి సున్నితంగా ఆలోచించాల్సిన అవసరముందని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం అక్రమ కట్టడాలు అంటున్న ప్రాంతాల్లో వెలసిన ఇళ్లకు ప్రభుత్వ పక్షాన రూ.కోట్లు ఖర్చుచేసి రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం, కరెంటు కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇంటి నంబరు కేటాయింపు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల ద్వారా సేవలు పొందుతూ పన్నులు కడుతుండగా, ఇప్పుడు హఠాత్తుగా అక్రమం అంటే వారు ఎక్కడకు వెళ్లాలి? అందులోనూ పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి? అని నిలదీశారు. గతంలో అనేకసార్లు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ కూడా చేశాయన్నారు.
మూసీ రివర్ బ్యూటిఫికేషన్‌లో భాగంగా గ్రేటర్ పరిధిలో ఇళ్లు కోల్పోయే వారితో చర్చించాలని సూచించారు. మూసీతోపాటు, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతల విషయంలోనూ ఎలాంటి దుందుడుకు విధానాలతో ముందుకెళ్లకూడదన్నారు. హైడ్రా పేరుతో ఏర్పాటు చేసిన విభాగంతో ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళుతోందని చెప్పారు. దీనిపై పేద ప్రజలు చేస్తున్న ఆందోళనలను, వారి మనోవేదనను పరిగణనలోకి తీసుకోకుండా హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించడాన్ని తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment