సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు నిర్ణయించడంలో దళితులు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. వీరికి రిజర్వ్ చేసిన స్థానాల్లో అధిక స్థానాలను దక్కించుకున్న పార్టీలే అధికార పీఠం ఎక్కిన నేపథ్యంలో అందరూ వీరిని తమవైపు తిప్పుకునే యత్నాల్లో మునిగితేలుతున్నారు. గత ఎన్నికల్లో 84 ఎస్సీ రిజర్వ్‌డ్ (రెండు ఎస్టీలకు రిజర్వు అయి ఉన్నాయి) స్థానాల్లో ఏకంగా 70 స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరోమారు తమ ఓటుబ్యాంకు స్థిరంగా ఉంచుకునేందుకు నానాతంటాలు పడుతుండగా, వాటిని కొల్లగొట్టేందుకు సమాజ్‌వాదీ అనేక ఎత్తులు వేస్తోంది. ఇక తన సామాజిక వర్గానికే చెందిన సీట్లలో గత ఎన్నికల్లో తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న బీఎస్పీ అధినేత మాయావతి తన బలాన్ని చూపేందుకు తహతహలాడుతున్నారు.
68 శాతం సీట్లు కొడితే అధికారమే...
యూపీలో 15 కోట్లకు పైగా ఉన్న ఓటర్లలో కనీసంగా 21 శాతం మంది అంటే సుమారు 3.15 కోట్ల మంది దళితులు ఉన్నారు. ఇందులో అత్యధికంగా 2.25 కోట్ల మంది జాతవ్ వర్గానికే చెందిన వారు కాగా, 16 శాతం మందితో పాసీలు 70 నుంచి 80 లక్షల మంది వరకు ఉంటారు. మిగతా కులాల వారు మరో కోటి మందికి పైగా ఉన్నారు. మొత్తంగా ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు 84 ఉన్నాయి. ఇందులో 68శాతానికి మించి సీట్లు సాధించిన పార్టీనే అధికారంలోకి వస్తుందని గత గణాంకాలు చెబుతున్నాయి. 2007లో బీఎస్పీ 61 స్థానాల(69శాతం)ను సాధించి అధికారంలోకి వస్తే, 2012లో ఎస్పీ 58 స్థానాలు (68శాతం) సాధించి అధికార పీఠమెక్కింది. ఇక 2017లో అయితే బీజేపీ ఏకంగా 70 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ కనీసంగా 58 స్థానాలను దక్కించుకునే పార్టీనే అధికారంలోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో అన్ని పార్టీలు వీరిని ఆకర్షించే పనిలో పడ్డాయి.
ఆకర్షణ మంత్రాల్లో పార్టీలు...
ముఖ్యంగా ఈ స్థానాల్లో తమ పట్టు ఏమాత్రం సడలకుండా చూసుకునేందుకు అధికార పార్టీ అనేక ఎత్తులు వేస్తోంది. 2012 ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు 14 శాతం మాత్రమే బీజేపీ దక్కించుకోగా, అది 2017లో ఏకంగా 40శాతానికి పెరిగింది. 84 రిజర్వ్‌డ్ స్థానాలకు గానూ 65 మంది జాతవేతర వర్గాల వారికే సీట్లు కేటాయించి ఆ స్థానాల్లో గెలిచి చూపించింది. నిజానికి జాతవ్‌లంతా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో ఉన్నప్పటికీ దోబీ, ఖాటిక్, పాసీ, వాల్మీకి వంటి జాతవేతర వర్గాలను ఆకర్షించి ఏకంగా 70 స్థానాలను దక్కించుకుంది. దక్కిన స్థానాలను దృష్టి పెట్టుకొనే యూపీ కేబినెట్‌లో ఏకంగా ఎనిమిది మందిని మంత్రులను చేసింది.
ప్రస్తుతం ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారు ప్రభుత్వ పథకాల నుండి పొందిన ప్రయోజనాలను నొక్కి చెప్పేలా పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఎస్పీ వర్గాలు పొందుతున్న గృహాలు, మరుగుదొడ్లు, ఆరోగ్య సంరక్షణ, సబ్సిడీ సౌకర్యాలను ఎక్కువగా ప్రచారం చేస్తూ వారి ఓట్లకు గాలమేస్తోంది. దళితులకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చామని బీజేపీ చెప్పుకుంటున్నా ఓట్లను తెచ్చిపెట్టే నేతలు లేకపోవడం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీలో యోగికి ఉన్న ప్రజాదరణ, పథకాలతోనే ఎస్సీలను ఆకర్షించే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది.
ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దళితులను ఆకట్టుకునేలా అంబేడ్కర్ జయంతిని ‘దళిత్ దివాళి’గా ప్రకటించాలని చేసిన వినతి పెద్ద చర్చకే దారితీసింది. దీనికి తోడు గడిచిన సెప్టెంబర్‌లో 15 రోజుల పాటు గ్రామీణ దళిత ఓటర్లే లక్ష్యంగా ‘గ్రామగ్రామాన దళితులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని పార్టీ నిర్వహించింది. తాను ప్రకటించిన గృహాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి హామీలు ఎక్కువగా దళిత వర్గాలకే లాభం చేస్తాయని ఆయన పదేపదే తన సమావేశాల్లో అఖిలేశ్ ప్రస్తావిస్తున్నారు.
మరోపక్క బీఎస్పీ 2007 ఎన్నికల్లో అమలు చేసిన ’బ్రదర్‌హుడ్’ విధానాన్ని అనుసరించేలా నిర్ణయాలు చేసింది. వివిధ మండలాల్లో సమావేశాల ద్వారా ప్రజలను సమావేశపరిచి సంప్రదాయ దళితుల ఓట్లతో పాటు బ్రాహ్మణ, వెనుకబడిన తరగతులు, ముస్లిం సమాజం మద్దతు కూడగట్టే ప్రణాళికలు అమలుపరుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం సితాపూర్‌లోని సిధౌలీ, అజంగఢ్‌లోని లాల్‌గంజ్ స్థానాలను మాత్రమే పొందిన బీఎస్పీ ఈమారు తన సత్తా చాటుకునేలా వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమైంది.
Comments
Please login to add a commentAdd a comment