
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఊరట కల్పించింది. దేశంలో, ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. బహిరంగ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. రోడ్ షోలు, పాదయాత్రలు, ఊరేగింపులపై నిషేధం కొనసాగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఇండోర్ లేక బహిరంగ మైదానాల్లో సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది.
అందుకు జిల్లా ఎన్నికల పరిశీలకుల అనుమతి తీసుకోవాలని, కోవిడ్ మార్గదర్శకాలు పాటించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండోర్ మైదానాల్లో 50 శాతం, బహిరంగ మైదానాల్లో 30 శాతం సీటింగ్ మేరకు ప్రజలకు అనుమతి ఉంటుందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
అటు.. ఇంటింటి ప్రచారానికి 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రచారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే చేయాలని సూచించింది. కాగా, ఏడు దశల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల (ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్) ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలు ఫిబ్రవరి 10న మొదలు కానున్నాయి. ఈ దశలో యూపీలో మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
(చదవండి: సమతామూర్తి విగ్రహావిష్కరణ.. సోషల్ మీడియాలో కాకపెంచిన కేటీఆర్ ట్వీట్)
Comments
Please login to add a commentAdd a comment