న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి మోదీ సర్కారుపై ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, వారు ఎంతకాలం ఎదురు చూడాలని ప్రశ్నించారు.
‘ప్రభుత్వ ఉద్యోగాలే లేవు. ఒకవేళ అవకాశం వస్తే పేపర్ లీక్ అవడం, ఎగ్జామ్ పెట్టినా ఫలితాలు ప్రకటించకపోవడం, లేదంటే ఏదో స్కామ్ కారణంగా క్యాన్సిల్ కావడం జరుగుతోంది. 1.25 కోట్ల మంది యువకులు రైల్వే గ్రూప్ డి ఉద్యోగ ఫలితాల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ విషయంలోనూ అదే పరిస్థితి. భారతదేశంలోని యువత ఎప్పటి వరకు ఓపిక పట్టాలి?’ అని వరుణ్ గాంధీ ట్విటర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు.
ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (UPTET)ని రద్దు చేస్తూ గత నెలలో యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వరుణ్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ లీక్ అయినట్టు వార్తలు రావడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (చదవండి: మేము లేకుండా బీజేపీని ఓడించలేరు)
‘యూపీ టెట్ పరీక్ష పేపర్ లీక్ అనేది లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకోవడం లాంటిది. కిందిస్థాయి అధికారులపై చర్య తీసుకోవడం ద్వారా దీనిని అడ్డుకోలేము. విద్యా మాఫియా, వారిని పోషిస్తున్న రాజకీయ నాయకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. చాలా విద్యాసంస్థలు రాజకీయ పలుకుబడి కలిగిన వారి ఆజమాయిషిలో ఉన్నాయి. వాటిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?’ అని వరుణ్ గాంధీ ప్రశ్నించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా కూడా ఆయన గళం వినిపించిన సంగతి తెలిసిందే. (చదవండి: గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పరిస్థితి కనించటం లేదు)
Comments
Please login to add a commentAdd a comment