
రవిశంకర్‌ను పరామర్శిస్తున్న మంత్రి రజిని
నాదెండ్ల: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ చేయాల్సింది దొంగ పరామర్శలయాత్ర కాదని క్షమాపణలయాత్ర అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా కనపర్రులో ఈ నెల రెండోతేదీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను టీడీపీ నాయకులు కారుతో ఢీకొట్టి హత్యచేసేందుకు ప్రయత్నించిన ఘటనలో గాయపడినవారిని గురువారం ఆమె పరామర్శించారు.
గాయపడిన కుంచాల శివశంకర్, చెవుల అనిల్‌కుమార్, ఇటీవల ప్రమాదానికిగురై కాలు పోగొట్టుకున్న పెరుమాళ్లపల్లి నటరాజ్‌లను పరామర్శించి రూ.20 వేల చొప్పున సాయం అందించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అమాయక బీసీ కార్యకర్తలపై అగ్రవర్ణాలకు చెందిన టీడీపీ నేతలు భౌతికదాడులకు దిగటం వారి బరితెగింపునకు నిదర్శనమన్నారు.
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించాలనుకోవటం టీడీపీ వారికి అలవాటని, దౌర్జన్యం, హత్యలు వంటి లక్షణాలు ఆ పార్టీ డీఎన్‌ఏలోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలో భాగంగానే ఈనెల 2న కారుతో తొక్కించారని, గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్‌లకు మానవత్వం ఉంటే గాయపడిన తమపార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలంలో 150 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమంగా రౌడీషీట్ ఓపెన్ చేశారని చెప్పారు. అన్యాయంగా దౌర్జన్యాలకు దిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.