
చిలకలూరిపేట: చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కు, ఇతర టీడీపీ నేతలకూ మహిళలంటే గౌరవంలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. ప్రతిసారి వైఎస్ భారతమ్మను రాజకీయాల్లోకి లాగడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. భారతమ్మ పేరును ఇకపై ప్రస్తావిస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. స్థానిక పురుషోత్తమపట్నంలోని తన నివాసంలో మంత్రి రజిని శనివారం మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..
భారతమ్మ విజయవంతమైన ఒక మహిళా పారిశ్రామికవేత్త. సాక్షి లాంటి దినపత్రికను తన నాయకత్వంలో దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలిపిన ఘనత ఆమెది. బాబు కుటుంబంలోని మహిళలు హెరిటేజ్ లాంటి సంస్థలకు సార«థ్యం వహించటం లేదా? చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఒక నీతి, జగనన్న కుటుంబ సభ్యులకు మరోనీతి ఉంటుందా? చంద్రబాబునాయుడు సీబీఐతో కలిసి సాక్షి దినపత్రికను ఇబ్బందులకు గురిచేయాలని గతంలో ఎంతో ప్రయత్నించారు. అయిన భారతమ్మ ఆ సంస్థను ఎంతో ఉన్నత స్థానంలో నిలిపారు. మహిళలను రాజకీయాల్లోకి లాగి లబ్ధిపొందాలని చూడడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం.
పేదల పెన్నిధి వైఎస్సార్..
దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల దైవం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల ప్రాణాలకు భరోసా కల్పించడమే కాక.. ఉచిత విద్యుత్ ద్వారా రైతులకు ఊతం ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఎందరో పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించారు. ఈ పథకాలన్నీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కొనసాగిస్తూనే ఉన్నాయి. అలాంటి వ్యక్తి మా పార్టీ డీఎన్‌ఏ అని చెప్పుకోవటానికి ఎంతో గర్వంగా ఉంది. టీడీపీ అధికారంలో ఉండగా ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక గొప్ప పరిపాలనను అందిస్తున్న సీఎం జగన్‌ను విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు.
జగనన్నను విమర్శించే స్థాయి లోకేశ్‌కు లేదు
అలాగే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి లోకేశ్‌కు లేదు. ఏకంగా 151మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఘనత జగనన్నది. సర్పంచి నుంచి మంత్రుల వరకు ఎందరో నాయకులను తయారుచేసిన గొప్ప నేత జగనన్న. అలాంటి వ్యక్తి పేరు ఎత్తే అర్హత ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని లోకేశ్‌కు లేదు. లోకేశ్ పాదయాత్రకు జనస్పందన లేక పూర్తి నిరాశలో ఉండడంతో ఏం చేయాలో తెలీక జగనన్నను తిట్టడం పనిగా పెట్టుకున్నారు.