సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధి కాకూడదనే దురుద్దేశంతో విశాఖలో భూములను ఆక్రమించారంటూ ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌సీపీపీ నేత వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విశాఖలో తనకు త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్ మినహా ఇతర ఆస్తులేవీ లేవని, ఈ విషయంలో ఈనాడు రామోజీ, చంద్రబాబు బృందానికి బహిరంగ సవాల్ విసురుతున్నట్లు ప్రకటించారు. ‘సీబీఐ, ఈడీ, ఎఫ్‌బీఐ.. ఏదైనా సరే మీదే ఛాయిస్. నాకు విశాఖలో ఉన్న ఆస్తులపై, రామోజీరావు అక్రమ సంపాదనపై విచారణకు సిద్ధమేనా?’ అని సవాల్ విసిరారు. రెచ్చగొట్టే తప్పుడు వార్తలు ప్రచురిస్తే తాను కూడా మీడియాలోకి వస్తానన్నారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రెండు లక్ష్యాలతో దుష్ప్రచారం..
చంద్రబాబు, పచ్చమీడియా తప్పుడు ప్రచారానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి.. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అడ్డుకోవడం. రెండోది.. గుంటూరు – విజయవాడకు 30 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాన్ని అమరావతి అనే పేరుతో రాజధానిగా చేయడం. రైతుల దగ్గర చౌకగా కొట్టేసిన కొన్ని వేల ఎకరాల ద్వారా రూ.లక్షల కోట్లు గడించాలనేదే వారి ఉద్దేశం.
కోర్టులో తేల్చుకుందామా?
ఆస్తులపై సీబీఐ, ఈడీ, అమెరికాలో ఉన్న ఎఫ్‌బీఐగానీ.. ఏ విచారణకైనా నేను సిద్ధం. మరి రామోజీ, చంద్రబాబు సిద్ధమేనా? ఈనాడు సంస్థల పెట్టుబడులన్నీ నిజాయితీగానే వచ్చాయా? కోర్టుకి లేఖ రాసి అక్కడే తేల్చుకుందాం. విచారణ జరిగితే ఎవరు జైలుకు వెళ్తారో సీబీఐ, ఈడీ, ఎఫ్‌బీఐ తేలుస్తాయి. ఉత్తరాంధ్రకు కార్యనిర్వాహక రాజధాని రానివ్వకూడదనేదే రామోజీ దురుద్దేశం. ఈ దుశ్చర్యలను ఖండిస్తూ అందరం ముందుకు వెళ్లాలి. పార్టీలు వేరైనా, ప్రజలంతా ఒకే తాటిమీద ఉండాలి.
కులపిచ్చితో నీతిమాలిన పనులు..
సాధారణంగా మీడియాలో ఆర్టికిల్స్‌ని ఇంక్‌తో రాస్తారు. రాష్ట్రంలో కొన్ని పత్రికలు మాత్రం పచ్చ కులాన్ని ఇంక్‌గా ఉపయోగించి వార్తలు రాస్తున్నాయి. పేరులో ‘జీ’ అని పెట్టుకొని తనకు తానే రామోజీ గౌరవం ఇచ్చుకుంటున్నారు. ఇలాంటి రాతలు చూసిన తర్వాత ఆయన్ని రామూ అని పిలవాలి. కులరొచ్చులో టీడీపీ కుల పత్రికలు, టీవీ చానళ్లు దిగజారి వ్యవహరిస్తున్నాయి.
సుప్రీం తీర్పు అమలు ఘనత వైఎస్సార్‌సీపీదే
దసపల్లా భూముల విషయంలో ప్రభుత్వానికి గానీ, రాజకీయనేతలకు గానీ ఎలాంటి సంబంధం లేదని భూ యజమానులు, బిల్డర్లు ఇప్పటికే వివరణ ఇచ్చారు. దసపల్లా భూములు రాణి కమలాదేవికి చెందినవని సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చినా గత సర్కారు అమలు చేయలేదు. దాన్ని అమలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో దసపల్లా భూములకు సంబంధించి దాదాపు 400 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. వారంతా ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. వాటిని ఇప్పుడు కూలగొట్టగలమా? ఇది పూర్తిగా ప్రైవేట్ భూమి. అందుకే 22 ఏ నుంచి తొలగించడంలో తప్పేముంది?
80 శాతం భూములు ఆ సామాజికవర్గానివే..
ప్రస్తుతం వివాదం నడుస్తున్న 64 ప్లాట్లకు సంబంధించిన వారిలో 55 మంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎక్కువగా లబ్ధి పొందింది చంద్రబాబు, ఆయన అనుచరులే. విశాఖలో ఇంచుమించుగా 75 నుంచి 80 శాతం భూములు ఆ ఒక్క సామాజిక వర్గానికి చెందినవారివే. వాస్తవానికి ఉత్తరాంధ్రలో, విశాఖలో కాపులు, యాదవులు, వెలమలు, కళింగులు, వెనకబడిన వర్గాలవారే ఎక్కువమంది ఉన్నా ఆస్తులు మాత్రం చంద్రబాబు సామాజిక వర్గానికే ఎక్కువగా> ఉన్నాయి.
గుమస్తాగా చేరి ఘోరమైన మోసాలు..
మార్గదర్శి చిట్‌ఫండ్స్, ఉషోదయ పబ్లికేషన్స్ రామోజీకి ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. రామోజీ మొదట ఓ కంపెనీలో గుమస్తాగా చేరారు. ఈయన తెలివితేటలు చూసి జీజే రెడ్డి అనే వ్యక్తి పెట్టుబడులు పెట్టారు. ఆయన వ్యవస్థాపక ప్రమోటర్‌గా కంపెనీలు ప్రారంభిస్తే.. జీజే రెడ్డిని ఘోరంగా మోసం చేసి ఆయన కుటుంబ సభ్యుల పేర్లని కూడా తొలగించి నామమాత్రం షేర్లు కట్టబెట్టి దోచుకున్న దుర్మార్గుడు రామోజీ.
నా కుమార్తె నేహారెడ్డిని 40 ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉన్న అరబిందో సంస్థల యజమాని కుమారుడికిచ్చి వివాహం చేశాం. ఇప్పుడు ఆమె ఇంటి పేరు వేణుంబాక కాదు... పెనక నేహారెడ్డి. రామోజీలా భాగస్వాముల్ని మోసం చేసి వారు ఆస్తులు సంపాదించలేదు. మా అమ్మాయిని వాళ్లింటికి కోడలుగా పంపిస్తే వాళ్ల ఆస్తులన్నీ నావి అయిపోతాయా?
బ్రహ్మణి పేరుతో చంద్రబాబు ఆదాయం ఆర్జిస్తే అవి బాలకృష్ణ ఆస్తులు అవుతాయా? బాలకృష్ణ ఆస్తులు బ్రహ్మణివి అవుతాయా? రామోజీ కుమారుడు కిరణ్‌తో శైలజా కిరణ్‌కు వివాహం అయ్యాక ఆస్తులు కొంటే అవి ఆమె తండ్రి ఉప్పలపాటి ఆస్తులు అవుతాయా? శైలజా కిరణ్ తండ్రికి చెందిన బాలాజీ హేచరీస్ రామోజీ రసగుల్లా అవుతుందా? రామోజీ మనవరాలు భారత్ బయోటెక్ సంస్థ అధిపతి తనయుడి భార్య అయినంత మాత్రాన అది రామోజీ కంపెనీ అవుతుందా?
రూ.5 వేల కోట్ల భూములను కాపాడాం..
నేను ఇప్పటికీ విశాఖ ఎంపీనే. అవినీతి, ఆక్రమణలకు పాల్పడితే సహించేది లేదు. టీడీపీ హయాంలో అక్రమార్కుల పాలైన సుమారు 400 ఎకరాల భూముల్ని రెండేళ్ల కాలంలో ప్రభుత్వానికి అప్పగించాం. వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.5 వేల కోట్లకు పైగా ఉంటుంది. దీన్ని ఎవరు తప్పుబట్టినా వారికి నైతిక విలువలు లేనట్టే.
Comments
Please login to add a commentAdd a comment