సాక్షి, హైదరాబాద్: శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నిక షెడ్యూలు విడుదల నేపథ్యంలో ఈ నెల 29న వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ విజయగర్జన బహిరంగ సభను టీఆర్‌ఎస్ పార్టీ వాయిదా వేసింది. హైదరాబాద్ మినహా పూర్వపు 9 జిల్లాల పరిధిలో మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఐదు వందల మందికి మించి సమావేశాలు పెట్టుకో వద్దన్న ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సభను వాయిదా వేయాలని టీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 15న వరంగల్‌లో విజయగర్జన సభ నిర్వహిస్తామని పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు గత నెల 17న పార్టీ పార్లమెంటరీ, లెజిస్లేచరీ విభాగం సంయుక్త భేటీలో ప్రకటించారు.
అయితే ఈనెల 15కు బదులుగా ఏటా పార్టీ నిర్వహించే దీక్షా దివస్ సందర్భంగా నవంబర్ 29కి విజయగర్జన సభ వాయిదా వేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ఈనెల 29న సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. తాజాగా శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల షెడ్యూలు విడుదలతో సభను వాయిదా వేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 16నాటికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగియనుండటంతో డిసెంబర్ చివరి వారంలో సభ నిర్వహించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
చదవండి: సమయం, స్థలం డిసైడ్ చెయ్.. నరికించుకోవడానికి వస్తా: బండి సంజయ్
నేటి సీఎం వరంగల్ పర్యటన రద్దు
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తలపెట్టిన వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన కూడా రద్దయింది. వరంగల్ పర్యటనలో భాగంగా ఔటర్ రింగు రోడ్డు, మున్సిపాలిటీల్లో రోడ్ల అభివృద్ధి, వరంగల్, హన్మకొండ జంట నగరాల్లో రవాణా, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులపై సీఎం సమీక్షకు ఏర్పాట్లు చేశారు. హన్మకొండ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు పార్టీ నేతలు సన్నా హాలు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి పర్యటన రద్దు నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment