సాక్షి, హైదరాబాద్: నూతన పార్లమెంటు భవన ప్రారంభ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్, ఆప్ సహా 19 పార్టీలు చేసిన సంయుక్త ప్రకటనపై తాము సంతకం చేయకున్నా.. కార్యక్రమానికి తాము కూడా దూరంగా ఉంటామని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పేర్కొంది. బీజేపీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు తమదైన శైలిలో పనిచేస్తామని స్పష్టం చేసింది.
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదించేలా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరుతూ ఆప్ అధినేత, ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్, బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఢిల్లీపై కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించడం మొదలు జాతీయ రాజకీయాలు, బీజేపీ, ప్రధాని మోదీ విధానాలపై కేసీఆర్, కేజ్రీవాల్ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో జరిగిన చర్చల సారాంశాన్ని కేసీఆర్‌కు కేజ్రివాల్ వివరించినట్టు తెలిసింది.
విపక్షాల ఐక్యతకు విశాల ఎజెండా
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ కార్యకలాపాలను విస్తరిస్తూనే, భావసారూప్య పార్టీ లను కలుపుకొని ముందుకెళ్లే ధోరణితో వ్యవహరించాల న్నది తమ విధానంగా సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించినట్టు తెలిసింది.
రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం బీజేపీపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు భావ సారూప్య పార్టీల నడుమ విశాల ఎజెండా అవసరమని పేర్కొన్నట్టు సమాచారం. విపక్షాల ఓట్ల చీలిక ద్వారానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటూ పలు ఉదాహరణలను పేర్కొన్నట్టు తెలిసింది.
1970వ దశకంలో ఎమర్జెన్సీ విధింపు దేశంలో కొత్త రాజకీయ పార్టీల ఆవిర్భావం, ప్రత్యామ్నాయ భావజాలానికి పురుడు పోసిందని.. ప్రస్తుత బీజేపీ విధానాలు కూడా దేశ రాజకీయాల్లో మార్పులకు కారణమవుతాయని కేసీఆర్ వివరించినట్టు సమాచారం. ప్రధాని మోదీ మోడల్ విఫలమైందని, కర్ణాటక ఫలితాలే ఇందుకు నిదర్శనమని ముగ్గురు సీఎంలు అభిప్రాయపడినట్టు తెలిసింది.
బీజేపీ కార్యాలయాలుగా గవర్నర్ ఆఫీసులు
విపక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై అధికారం చేపట్టిన రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకుని బీజేపీ అరాచకాలకు పాల్పడుతోందని ముగ్గురు సీఎంల భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఢిల్లీ, పంజాబ్‌లలో బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్ పేర్కొనగా.. తెలంగాణలోనూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టిన వైనం, దీనిపై సుప్రీంకోర్టు దాకా వెళ్లిన విషయాన్ని కేసీఆర్ వివరించినట్టు సమాచారం.
దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో ముందు వరుసలో ఉంటామని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే జూన్ మొదటి వారంలో జాతీయస్థాయిలో విపక్షాల నేతలు, సీఎంల సమావేశం జరిగే అవకాశం ఉందని కేజ్రీవాల్ వెల్లడించినట్టు సమాచారం. అయితే ఇతర విపక్షాలతో కలిసి నడిచే అంశంలో కేసీఆర్ కొంత ఆచితూచి స్పందించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment