కోల్‌కతా: పశ్చిమబెంగాల్ శాసనసభ కీలక తీర్మానం చేసింది. రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు తీర్మానానికి బెంగాల్ శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. శాసన సభ సమావేశంలో భాగంగా మండలి ఏర్పాటు తీర్మానానికి 196 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 69 మంది ఎమ్మెల్యేలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఇక బెంగాల్‌లో 1952లో శాసన మండలిని ఏర్పాటు చేశారు. అయితే 1969లో లెఫ్ట్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేసింది. ఇక ఇటీవల జరిగిన రాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తృణముళ్ కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే.. శాసన మండలి ఏర్పాటు చేస్తామని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు దేశంలో ఆరు రాష్ట్రాల్లో( బిహార్, యూపీ, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్ణాటక) శాసన మండలి అమలులో ఉంది. ఇక మండలి ఏర్పాటు తీర్మానానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. శాసన మండలి ఏర్పాటు తీర్మానాన్ని ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారీ తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో 23 రాష్ట్రాల్లో విధాన పరిషత్ లేదని, కొంతమంది టీఎంసీ నాయకులు మండలిలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అందుకోసమే మండలి ఏర్పాటుకు తీర్మానం చేశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment