జనసేన లో పవన్ కళ్యాణ్ .. నాదెండ్ల మనోహర్ తరువాత మూడో స్థానంలో ఉన్న పవన్ సోదరుడు నాగబాబుకు రాజకీయ ఆలోచనలు ఉన్నా.. వాటిని సరిగా అమలు చేయలేకపోవడం .. స్థిరత్వం లేకపోవడం.. సరైన ప్రణాళిక... వ్యూహాలు కొరవడడంతో చట్టసభల్లోకి వెళ్లే అవకాశం దక్కడం లేదు.. గతంలో 2019 లో నరసాపురం నుంచి జనసేన తరఫున లోక్ సభకు పోటీ చేసిన నాగబాబుకు రెండున్నర లక్షల ఓట్లు వచ్చినా గెలుపు సాధ్యపడలేదు.. అక్కడ రఘురామా కృష్ణం రాజు గెలవగా ఈయన ఏకంగా మూడో స్థానంలో మిగిలిపోయారు.. ఈసారైనా చట్టసభలో అధ్యక్షా అనాలన్నది అయన ఆశగా కనిపిస్తోంది.. చిన్నా చితకా యాక్టర్లు.. ఛోటామోటాగాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ మెగా బ్రదర్ అనే బ్రాండ్ ఉన్న నాకేం తక్కువ.. నేనూ గెలుస్తా అనే ధీమా ఆయనలో ఉన్నా.. తన కోరికను నెరవేర్చుకునే కృషి.. పట్టుదల.. అవేమి లేవు.. దీంతో ఆయన కోరిక నెరవేరడం లేదు..
ఈసారైనా గెలవాలన్న అయన లోక్ సభకు పోటీ చేస్తారని అంటున్నారు.. అయితే గతంలో కాపులు ఎక్కువగా ఉంటారన్న లెక్కతో నరసాపురంలో పోటీ చేసి దెబ్బతిన్న నాగబాబు ఈసారి రూటు మార్చారని అంటున్నారు.. ఏకంగా మూడు జిల్లాలు మారి అనకాపల్లికి రావడానికి ప్లాన్ చేస్తున్నారు . అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రూట్ వేస్తున్నట్లు అయన కదలికలు స్పష్టం చేస్తున్నాయి. అయన ఇటీవల విశాఖలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.. దానికితోడు కాపు నాయకులూ.. వ్యాపారాలు.. పారిశ్రామికవేత్తలతోను సైతం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ... ఇంకా నిధుల వసూళ్లు వంటి పనుల్లో అయన యాక్టివ్ గా ఉన్నారు.
ఇందులో భాగంగా పెందుర్తి.. యలమంచిలి నియోజకవర్గాల్లో అయన పర్యటిస్తున్నారు.. ఈమధ్యనే వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు... రాజీనామా చేసి జనసేనలో చేరారు.. అయన పెందుర్తిలో పోటీ చేస్తారని .. ఈ మేరకు పవన్ సైతం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇద్దరికీ ప్రయోజనం కలిగేలా నాగబాబు సైతం పెందుర్తిలో పర్యటిస్తున్నారు. అయితే ఇదే పెందుర్తి టిక్కెట్ తనకు కావాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.. ఇక్కడ వైఎస్సార్‌సీపీ నుంచి అదీప్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో పెందుర్తి పోరు మంచి రసకందాయంగా ఉంటుందని తెలుస్తోంది.
ఇక అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కూడా లైన్లో ఉన్నారు.. తన కొడుక్కి ఎంతమాత్రం టిక్కెట్ ఇవ్వాల్సిందే అని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నుంచి బైరా దిలీప్ అనే వ్యాపారవేత్త సైతం లైన్లో ఉన్నారు. తన కొడుక్కు టిక్కెట్ ఇవ్వకుండా పొత్తులో భాగంగా నాగబాబు పోటీ చేస్తే అయ్యన్న ఊరుకుంటారా ? మరి ఆయన్ను ఎలా శాంత పరుస్తారన్నది తెలియడం లేదు. ఈసారి నాగబాబు తన అభీష్టం మేరకు అనకాపల్లిలో పోటీ చేయగలరా లేదా అన్నది చూడాలి..
- సిమ్మాదిరప్పన్న
ఇదీ చదవండి: ఢిల్లీలో బాబుకు ఎదురుదెబ్బ.. పవన్‌తో కొత్త రాయబారం!
Comments
Please login to add a commentAdd a comment