సాక్షి, హైదరాబాద్: నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానంటూ మంత్రి కొండా సురేఖ.. సమంతకు క్షమాపణలు చెప్పారు. ‘‘మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలన్నదే నా ఉద్దేశం. మీ మనోభావాలు దెబ్బ తీయాలని కాదు. స్వశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా’ అంటూ కొండా సురేఖ ట్వీట్ చేశారు.
నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు.
— Konda surekha (@iamkondasurekha) October 2, 2024
అసలేమైందంటే...!
ఈ మొత్తం వివాదం వెనుక ఇటీవల మంత్రి కొండా సురేఖ మెదక్ పర్యటన సందర్భంగా జరిగిన ఘటన, దానిపై బీఆర్‌ఎస్ పేరిట సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌తో బీజం పడింది. అక్కడ జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఒక నూలు దండను మంత్రి సురేఖ మెడలో వేశారు. కొందరు ఈ ఫోటోను పెట్టి అసభ్య భావంతో ట్రోలింగ్ చేశారు. దీనిపై కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.
సురేఖపై ట్రోలింగ్‌కు నిరసనగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, చేనేత కార్మీకులు తెలంగాణ భవన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ చేస్తూ కొండా సురేఖను విమర్శించారు. తనను ట్రోల్ చేశారంటూ సురేఖ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం కొండా సురేఖ తీవ్రంగా స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ..
గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి నివాళులర్పించిన అనంతరం బాపూఘాట్ వద్ద, గాందీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని హత్య చేయాలని బీఆర్‌ఎస్ నేతలు చూస్తున్నారని.. అలాంటప్పుడు తాను దొంగ ఏడుపులు ఎందుకు ఏడుస్తానని ప్రశ్నించారు. సినీ నటి సమంత, నాగార్జున కుమారుడు నాగచైతన్య విడిపోవడానికి కేటీఆరే కారణమని.. ఆయన చాలా మంది హీరోయిన్లను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే.
చాలా మంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుని త్వరగా పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన డ్రగ్స్‌కు అలవాటు పడి, వాళ్లకూ డ్రగ్స్ అలవాటు చేశారు. వాళ్ల జీవితాలతో ఆడుకునేలా బ్లాక్‌మెయిల్ చేసి ఇబ్బందులు పెట్టారు. వాళ్లను డ్రగ్స్ కేసులో ఇరికించి ఆయన తప్పుకున్నారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేసి, రహస్యంగా మాట్లాడుకున్న విషయాలను రికార్డు చేసి వాళ్లకు వినిపించేవారు.
కేటీఆర్‌పై ఆరోపణలు
ఆ రికార్డులను అడ్డుపెట్టుకుని బెదిరించేవారు’’ అని కొండా సురేఖ ఆరోపించారు. నిజానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ తనను ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కానీ అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గురించి, మంత్రి సీతక్క గురించి కూడా గతంలో ఇలాంటి పోస్టులే పెట్టారని.. ఇప్పుడు తనపై పెడుతున్నారని మండిపడ్డారు. తనపై ట్రోలింగ్ చేసినవారు, వారి వెనుక ఉండి నడిపిస్తున్న వారిపై కేసులు పెడుతున్నామని చెప్పారు.
దుమారం రేపిన కొండా సురేఖ వ్యాఖ్యలు
అయితే, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అటు రాజకీయాల్లో ఇటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సరికాదని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో కొండా సురేఖ బుధవారం అర్ధరాత్రి సమంతకు ట్వీట్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆ వివాదం సద్దుమణిగినట్లైంది.
👉చదవండి : చౌకబారు రాజకీయం
Comments
Please login to add a commentAdd a comment