
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ బీజేపీ నేత యశ్వంత్ సిన్హా తృణముల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తీర్థం పుచ్చుకున్నారు. కోల్‌కతాలోని టీఎంసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు సుదీప్ బందోపాధ్యాయ, డెరెక్ ఓబ్రెయిన్‌ల సమక్షంలో యశ్వంత్‌సిన్హా టీఎంసీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కాలంలో బీజేపీ ఏకాభిప్రాయంపై నమ్మకం కలిగి ఉండేదని తెలిపారు. కానీ, నేడు బీజేపీలో అటువంటి పరిస్థితులు లేవని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం అణిచివేతను మాత్రమే నమ్ముతోందని ఆయన బీజేపీపై మండిపడ్డారు. అందుకే శిరోమణి అకాలీదళ్, బీజేడీ పార్టీలు బీజేపీని విడిచిపెట్టాయని తెలిపారు. బీజేపీతో ఇప్పడు ఎవరు స్థిరంగా నిలబడ్డారో చెప్పాలని ప్రశ్నించారు.
దేశంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వ సంస్థలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని తెలిపారు. కానీ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని దుయ్యబట్టారు. న్యాయవ్యవస్థతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలు బలహీనంగా మారాయని మండిపడ్డారు. రైతుల ఆందోళనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇక యశ్వంత్ సిన్హా మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment