విజయ్ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పేసిన మంత్రి కీర్తన | Youngest minister in Tamil Nadu cabinet Keerthana on CM Vijay Govt | Sakshi
Sakshi News home page

విజయ్ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పేసిన మంత్రి కీర్తన

May 10 2026 3:39 PM | Updated on May 11 2026 2:34 PM

Youngest minister in Tamil Nadu cabinet Keerthana on CM Vijay Govt

చెన్నై: తమిళనాడులో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా నిలిచిన టీవీకే నాయకురాలు ఎస్‌.కీర్తన (29) ఆదివారం కొత్త ముఖ‍్యమంత్రి జోసెఫ్ విజయ్ క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తొమ్మిది మంది మంత్రుల్లో ఆమె ఒకరిగా నిలిచారు. ​కీర్తన తెలుగు యువతి. 1996లో విరుదునగర్‌లో జన్మించారు. విజయ్ క్యాబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి ఆమె.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కీర్తన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుందని అన్నారు. విజయ్ టీవీకే ప్రభుత్వం మార్పు తీసుకొచ్చిందని చెప్పారు. దళపతి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వచ్చేశారని, ఇక అన్నీ మారిపోతాయని ఆమె ఉత్సాహంగా చెప్పారు.

ప్రతిభకు విజయ్ ఇచ్చే ప్రాధాన్యాన్ని ఆమె ప్రస్తావించారు. తనకు మంత్రి పదవి రావడం టీవీకే పార్టీ విధానాన్ని చూపుతోందని చెప్పారు.

“మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం పొందడం, క్యాబినెట్ మంత్రి కావడం ఏ రాష్ట్రంలోనైనా సులభమా? కాదు. విజయ్‌ ప్రతిభను చూస్తారు, నైపుణ్యాన్ని చూస్తారు. మార్పులన్నీ తీసుకురావడానికే మేము వచ్చాం. ఈ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుంది. మాది అత్యంత దీర్ఘకాలం కొనసాగిన ప్రభుత్వం అవుతుంది’’ అని ఆమె అన్నారు.

కీర్తన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలలో గణితంలో బీఎస్సీ పూర్తి చేశారు. తర్వాత 2019లో పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో స్టాటిస్టిక్స్‌లో ఎమ్మెస్సీ చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీర్తన శివకాశి స్థానం నుంచి 11,697 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

గతంలో కీర్తన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... “నేను హిందీలో మాట్లాడుతున్నాను. మా పార్టీ ప్రాతినిధ్యాన్ని భారత్ అంతటా, ఇతర దేశాల్లో కూడా విస్తరించాలనుకుంటున్నాను. అందుకే హిందీలో మాట్లాడుతున్నాను. నా నాయకుడి గురించి అందరికీ తెలియాలి. మా పార్టీ గురించి అందరికీ తెలియాలి. రాజకీయాలకు భయపడకూడదు. అందరూ రాజకీయాల్లోకి రావాలి. నేను ఒక ఉదాహరణ మాత్రమే. అందరూ రాజకీయాల్లో చేరాలి అనేదే నా కోరిక” అని చెప్పారు.

ఇదిలా ఉండగా, కీర్తనతో పాటు ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టైయన్, కేజీ అరుణ్‌రాజ్, పి.వెంకటరామనన్, ఆర్.నిర్మల్‌కుమార్, రాజ్‌మోహన్, టీకే ప్రభు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ శనివారం విజయ్‌తో రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప‍్రమాణ స్వీకారం చేయించారు.. మే 13లోపు అసెంబ్లీలో మెజార్టీ నిరూపించాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement