సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణను పాలించే నైతికత లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేదన్నారు. ప్రతిపక్షాలపై బీఆర్‌ఎస్ నేతలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శనివారం తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు షర్మిల వినతిపత్రాన్ని సమర్పించారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పట్టపగలే వీధికుక్కలు పసిపిల్లలపై దాడులు చేస్తుంటే బీఆర్‌ఎస్ గూండాలు ప్రతిపక్షాల మీద కుక్కల్లా పడి దాడులు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతి పక్షాలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, మహిళలకు గౌరవం లేదన్నారు. దేశంలో భారత రాజ్యాంగం అమలవుతుంటే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని షర్మిల ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు అన్న పదం వింటేనే కేసీఆర్, బీఆర్‌ఎస్‌కు ఎందుకు అంత అసహనమని ప్రశ్నించారు.
భూములన్నీ కబ్జాలు చేసి అక్రమంగా సంపాదించుకున్న ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ కేసీఆర్ టికెట్లు ఇవ్వాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ.. త్వరలో రాష్ట్రపతి దగ్గరకు కూడా వెళ్లబోతున్నామని షర్మిల తెలిపారు. గవర్నర్ తాము చెప్పిన దానికి ఏకీభవించారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసిరావాలని ఆమె పిలుపునిచ్చారు. మెడికల్ విద్యార్థిని ప్రీతికి తన సానుభూతి ఉందని పేర్కొంటూ.. ఆత్మహత్యాయత్నం చేసిన మరో మెడికల్ స్టూడెంట్‌కు కూడా తమ పార్టీ సానుభూతి ఉంటుందని షర్మిల ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment