గుంటూరు, సాక్షి: పార్టీ కేడర్‌తో కీలక సమావేశం నిర్వహించేందుకు అధికారపక్షం వైఎస్సార్‌సీపీ సిద్ధం అయ్యింది. మంగళవారం మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జరగబోయే ఈ మీటింగ్‌లో మండల, బూత్ లెవల్‌లో పని చేసే పార్టీ శ్రేణితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు(కొత్త-పాత ఇన్‌ఛార్జిలు) పాల్గొననున్నారు. ఎన్నికలకు ముందర జరగబోయే క్షేత్రస్థాయి సమావేశం ఇదే చివరిది.
రేపటి సమావేశానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా హాజరవుతారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో.. ఎన్నికల్లో ఎలా పని చేయాలో కేడర్‌కు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని అన్నారు.
ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం ఇది. క్షేత్రస్థాయి. .మండల కార్యకర్తల సమావేశం. సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు పాల్గొంటారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సీఎం జగన్ దిశానిర్ధేశం చేస్తారు. ప్రత్యర్ధులు అవకతవకలకు పాల్పడకుండా ఎలా చూడాలో చెప్తారు. ప్రజల్లోకి మరింతగా పార్టీని ఎలా తీసుకెళ్లాలో వివరిస్తారు..
గడపగడపకు కార్యక్రమంతో ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ ప్రజల్లోనే ఉంది. నాయకులెప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని.. పథకాల్ని ప్రజలకు చేరవేస్తున్నాం. ఈ నాలుగున్నరేళ్లుగా ప్రజల అవసరాలను తెలుసుకుని మరీ తీరుస్తున్నాం. అందుకే.. అందరి కంటే ముందుగా ఎన్నికల కోసం గట్టి టీమ్‌ను సిద్ధం చేసుకున్నాం. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పూర్తి చేశాం. బూత్ కమిటీలు కూడా రెడీ చేస్తున్నాం. సమర్ధవంతమైన బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక ఓరియంటేషన్ ప్రక్రియ రేపు జరగనుంది. రేపటి సమావేశం తర్వాత మేం పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతాం.
.. మా అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తున్నప్పుడు ఏదో అయిపోతుందని మమ్మల్ని విమర్శించారు. మేం ఆరోజే చెప్పాం. మీకే బ్యాడ్ టైం మొదలుకాబోతోందని. అసంతృప్తుల్ని పిలిచి మాట్లాడుతున్నాం.. అంతా సర్దుకున్నారు. టీడీపీ-జనసేన అతుకుల బొంతగా ఉంది. పవన్ ను ఘోరంగా అవమానించి 24 సీట్లు కేటాయించారు. ఆ రెండు పార్టీల్లోని అసంతృప్తులు మా పార్టీలోకి వస్తామంటున్నారు. గంపగుత్తగా వస్తున్నారని మేం ఎవరిని పడితే వారిని చేర్చుకోం. అలాంటి వారి వల్ల అనవసరమైన తలనొప్పులు.. పార్టీకి భారం. అవకాశం ఉన్న చోట వాళ్లను చేర్చుకునే అంశం పరిశీలిస్తాం అని సజ్జల పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయి సమావేశం ఏర్పాట్లను సజ్జలతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి పార్టీ ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి సమీక్షించారు.
‘‘ఎంతమంది కలిసి వచ్చినా మా(వైఎస్సార్‌సీపీ) విజయాన్ని ఎవరూ ఆపలేరు. 175 కి 175 గెలవబోతున్నాం...ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి. మార్చి 3వ తేదీన చివరి సిద్ధం సభ జరగబోతోంది. ఎన్నికలకు సమాయాత్తమవుతున్న సమయంలో రేపటి మీటింగ్ కీలకం కాబోతోంది. కీలకమైన నాయకులు,బూత్ లెవల్లో నాయకులంతా రేపటి మీటింగ్ హాజరవుతారు. పార్టీ పరంగా వివిధ హోదాల్లో ఉన్న 2,700 మందికి ఆహ్వానం పంపించాం’’ అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment