సాక్షి, తాడేపల్లి: విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముందన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, మాజీ మంత్రి మేరుగు నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘భావితరాలకు దికూచ్చిగా ఉండాలని అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కృషి చేశారు. గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టమంటే చంద్రబాబు కేసులు పెట్టారు. ఎక్కడైనా విగ్రహం పెట్టినప్పుడు చూడటానికి వెళ్లినా కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పుడు విజయవాడలో అంబ్కేదర్ విగ్రహంపై దాడికి ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముంది. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉండకూడదనే దాడి చేశారు. తక్షణమే ఈ ఘటనపై విచారణ చేపట్టాలి. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ..‘ప్రజల దృష్టిని మళ్లించడానికే అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. ప్రజలను భయభాంత్రులకు గురి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా కమిటీలు వేస్తామని కథలు చెబుతున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
మరోవైపు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలి. ప్రభుత్వమే ఈ దాడి చేయించిందనే అనుమానం కలుగుతోంది. అంబేద్కర్ విగ్రహంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారంటే వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయి అనేది అర్థం చేసుకోవచ్చు. విగ్రహం వద్ద వైఎస్ జగన్ పేరుని తొలగించవచ్చేమో కానీ ప్రజల గుండెల్లో ఆయన పేరును తొలగించలేరు. అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలి. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు దగ్గరలోనే ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు?. సామాజిక న్యాయం కోసం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహం నిర్మించారు. కూటమి నేతలకు సామాజిక న్యాయం అంటే పట్టదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఇదే ఘటనపై తిరుపతిలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం వద్ద దాడిని ఖండిస్తున్నాను. అన్ని జాతులకు ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఆరాధ్యదైవంగా అంబేద్కర్‌ను భావిస్తారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఘటనలో బాధ్యులైన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. దేశానికే ఆదర్శంగా ఉండాలని వైఎస్ జగన్ విజయవాడ నడి బొడ్డున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే చూస్తూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment