
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిలో అసహనం పెరిగిపోయిందని.. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్‌లో ఆయన ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మళ్లీ తాను అధికారంలోకి రాలేననే దిగులు చంద్రబాబుకు ఉందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పనిచేయటం లేదని.. చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. టీడీపీ పని అయిపోయిందన్నారు. గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు కొత్తగా జరుగుతున్నాయా?. గతంలో ఏకగ్రీవమైన గ్రామాలకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదా? అని ఆయన ప్రశ్నించారు. చదవండి: ఇష్టారాజ్యంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తీరు..
‘‘ఏకగ్రీవ ఎన్నికలను రాజకీయ పక్షాలు ప్రోత్సహించాలి. ప్రజాస్వామ్యంలో లక్ష్మణరేఖ దాటితే మూల్యం చెల్లించక తప్పదు. నిమ్మగడ్డ వ్యవహారశైలి అత్యంత దురదృష్టకరం. పంచాయతీల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు. పార్టీల ప్రమేయం లేకుండా పంచాయతీ ఎన్నికలు జరగాలని రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు పచ్చకాగితం రిలీజ్ చేశారు. మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ వ్యతిరేకం కాదా?. ఎస్‌ఈసీ ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు?. రాజకీయ గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఎస్‌ఈసీ చూస్తున్నట్లుందని’’ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చదవండి: కొంప కొల్లేరు.. టీడీపీ బెంబేలు..
Comments
Please login to add a commentAdd a comment