YSRCP MLA Thopudurthi Prakash Reddy Comments On Chandrababu, Details Inside - Sakshi
Sakshi News home page

‘ఎన్టీఆర్‌ కుమార్తెను చంద్రబాబు పెళ్లి చేసుకోకుంటే..’

Published Sat, Sep 10 2022 12:21 PM | Last Updated on Sat, Sep 10 2022 2:00 PM

YSRCP MLA Thopudurthi Prakash Reddy Comments On Chandrababu - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి  

రాప్తాడు(అనంతపురం జిల్లా): ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే నీచ చరిత్ర కలిగిన చంద్రబాబుకు సీఎం జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఆయన రాప్తాడులో మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ పేద, దళిత, బడుగు బలహీన వర్గాల వారిని అంటరానివారిగా చూసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ ఆయన మాట్లాడిన మాటలను ఇంకా ఎవరూ మరిచిపోలేదన్నారు. మోసగాళ్లు అని తెలుసుకుని ప్రజలు ఓట్లతో తరిమినా ఇంకా బుద్ధి రాకపోవడం శోచనీయమన్నారు.
చదవండి: టీడీపీ నేత వంగలపూడి అనితకు బ్యాంకు నోటీసులు

భారతమ్మ గురించి మీకేం తెలుసు..? 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు,బలహీన, దళిత, గిరిజన వర్గాల వారికి రాజకీయంగా పదవులు కట్టబెట్టి అన్నింటా పెద్దపీట వేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి దుయ్యబట్టారు. లంచాలు, దళారులు లేకుండా పేదవాడి ఖాతాల్లోకే డబ్బు జమ చేస్తుండడం పచ్చ కళ్లు చూడలేకపోతున్నాయని విమర్శించారు. పేదల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎంను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక ఆయన కుటుంబసభ్యులపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం తల్లి వైఎస్‌ విజయమ్మ, సతీమణి భారతిని దూషించడం భావ్యం కాదన్నారు. మంచి తల్లిగా, పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న భారతమ్మపై లేనిపోని అభాండాలు మోపుతుండడం దుర్మార్గమన్నారు. దైనందిన జీవితంలో తనకు ఎదురవుతున్న అన్ని అడ్డంకులు ఎదుర్కొని రాణిస్తున్న వైఎస్‌ భారతమ్మ మహిళలందరికీ ఆదర్శమని, అలాంటి మహిళ గురించి ఏం తెలుసని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

ఆడవాళ్లతో రాజకీయం చేయడం మీకే చెల్లు..  
జీవిత కాలం ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం టీడీపీ నాయకులకే చెల్లని ఎమ్మెల్యే అన్నారు. ‘ఎన్టీఆర్‌ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టే చంద్రబాబు వెలుగులోకి వచ్చాడు. లేకపోతే ఎవరో కోన్‌ కిస్కా. పప్పు లోకేశ్‌కు రాజకీయ భవిష్యత్తు  కోసమే ఎన్టీఆర్‌ కుటుంబంలో పెళ్లి చేసుకున్నాడు. ఎవరైనా నాయన పేరు చెప్పడం, వంశం పేరు చెప్పడమో జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు అత్తగారి కుటుంబం గురించి చెప్పకుంటున్నారు. ఎన్టీఆర్‌ కుమార్తెగా అందరూ ఆమెను గౌరవిస్తారు. కానీ రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు చంద్రబాబే తన భార్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రమంతా తిరిగినా ప్రజల నుంచి ఆదరణ లభించకపోవడంతో మీడియా ముందు దొంగ ఏడుపులు ఏడ్చాడు’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజకీయ ఉనికి కోసం కుటుంబంలోని మహిళలను బజారులోకి ఈడ్చుకున్న దౌర్భాగ్యుడు చంద్రబాబు అని మండిపడ్డారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏం సాధించావ్‌?   
వైఎస్సార్‌ సీపీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి విమర్శించారు. ఉనికి చాటుకునేందుకు నానా యాగీ చేస్తున్నారని దుయ్యబట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేసిన ఘన కార్యమేంటో చెప్పాలని నిలదీశారు. ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎంత మందికి ఇళ్లు కట్టారు, ఉపాధి కల్పించారు అనే విషయాలను బహిరంగపరచాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు బంధువులు, టీడీపీ నాయకులు అమరావతిలో భూములు కొనుక్కొన్నారు కనుకనే రాజధాని అక్కడే కట్టాలంటూ రభస చేస్తున్నారన్నారు. కుప్పంలో టీడీపీని కాపాడుకునేందుకే దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ఆయన విమర్శించారు.

సంక్షేమంలో మన రాష్ట్ర ఆదర్శం.. 
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దేశస్థాయిలో పేరు సంపాదించారని ఎమ్మెల్యే కొనియాడారు. సచివాలయాలు, వలంటీర్ల ద్వారా అర్హులందరికీ కుల, మత, పారీ్టలకతీతంగా సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకే అందిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ కింద వాటిని నిర్మించుకునేందుకు రూ.15 వేలు ఇస్తే ఆ డబ్బును కూడా తిన్న సిగ్గు లేని వ్యక్తులు టీడీపీ నాయకులు అని విమర్శించారు. నీరు–చెట్టు పథకం ద్వారా వేల కోట్ల నిధులు మింగిన ఘనులు ఆ పార్టీ నేతలని దుయ్యబట్టారు.

గడపగడపకూ ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్తున్న తమకు టీడీపీ నాయకుల అరాచకాల గురించి ప్రజలు వివరిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ‘మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీకుతాం, పొడుస్తామని ఓ తెలుగుదేశం నాయకుడు అంటున్నాడు. నేడు మా ప్రభుత్వమే ఉంది. ఈ పొద్దు మేం అనుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కానీ మా నాయకుడు ఆదేశించినట్లుగా సంయమనంతో పోతున్నాం’ అని ఆయన చెప్పారు. ఇంకోసారి సీఎం, ఆయన కుటుంబం గురించి అనుచితంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైస్‌ ఎంపీపీ బోయ రామాంజినేయులు, వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ జూటూరు శేఖర్, యూత్‌ మండల కన్వీనర్‌ చిట్రెడ్డి సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement