గుంటూరు, సాక్షి: నిలువెల్లా విషం నింపేసుకున్న రాజకీయ ప్రత్యర్థులు.. అక్కసుతో ఆయనపై రాళ్లు వేయించారు. పైగా సింపథీ డ్రామాలంటూ ఎల్లో మీడియా ద్వారా రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. కానీ, సీఎం జగన్‌ది ఉక్కు సంకల్పం. సంయమనంతో వ్యవహరిస్తూ.. నొప్పిని భరిస్తూనే చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు. పచ్చ కుట్రల్ని అర్థం చేసుకుంటున్నారు గనుకే జనం సైతం ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త స్లోగన్ తెరపైకి రాగా.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది.
కొన్నాళ్ల కిందట సిద్ధం.. పేరుతో ఎన్నికల సమరశంఖారావం పూరించారు సీఎం జగన్. కేవలం రెండు అక్షరాలతోనే షెడ్యూల్ రాకముందే ఎన్నికల వాతావరణం సృష్టించగలిగారాయాన. అంతేకాదు దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో నాలుగు సిద్ధం సభల్ని నిర్వహించి.. అశేష ప్రజా స్పందన దక్కించుకున్నారు. సిద్ధంను కాపీ కొట్టి మేము కూడా సిద్ధం, సంసిద్ధం అంటూ విపక్షాలు ప్రచారం చేసుకున్నాయేగానీ అవి అస్సలు వర్కవుట్ కాలేదు. ఆపై కొత్తగా ఎన్ని స్లోగనులు తెచ్చినా.. జనాలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి.
ఈ టైమ్ లో వైసీపీ మరో సరికొత్త ప్రచార అస్త్రాన్ని రెడీ చేసింది. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రతో ముందుకు వచ్చింది. సిద్ధం సభలు జరిగిన ప్రాంతాల్ని మినహాయించి 21 రోజుల యాత్రను చేపట్టారు సీఎం జగన్. మేమంతా సిద్ధంలోనూ సీఎం జగన్‌కు బ్రహ్మరథమే పడుతున్నారు జనం. ఇక ఇప్పుడు.. జగన్ కోసం సిద్ధం అంటూ మరో కొత్త స్లోగన్‌ను తెరపైకి తెచ్చింది.
పార్టీకి సంబంధించి ప్రచారాల విషయంలో వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి దూకుడునే ప్రదర్శిస్తోంది. వైవిధ్యతతో జనాల్ని ఆకట్టుకోగలగడమే కాకుండా.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతోంది. ఈ విషయంలో అనుకూల మీడియా, ఆస్థాన రచయితలు ఉన్న టీడీపీ మాత్రం ప్రచార వ్యూహాల్లో వైఎస్సార్‌సీపీకి దరిదాపుల్లోకి రాలేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment