
గుండెపురిలో ‘వంటా వార్పు’కార్యక్రమంలో షర్మిల
తిరుమలగిరి (తుంగతుర్తి): కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, రిజిస్ట్రేషన్, బస్ చార్జీలు, ఇంటి పన్నులు పెంచడంతో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని, పేద మధ్య తరగతి ప్రజలు ఏ వస్తువు కొనలేని దిక్కు తోచనిస్థితిలో ఉన్నారని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం యాత్ర 39వ రోజు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని రూప్లా తండా, చౌళ్ల తండా, గుండెపురి గ్రామాల్లో సాగింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర ధరలకు నిరసనగా గుండెపురిలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజల రక్తం తాగుతున్నాయని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు బుద్ధి చెప్పకుంటే మన బతుకులు బుగ్గిపాలవుతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న పాల్గొన్నారు.