ఒంగోలు టౌన్: మోసపూరిత టోల్‌ఫ్రీ నంబర్లతో కస్టమర్ సపోర్ట్ స్కాములపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ మలికా గర్గ్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి సమాచారం కోసమైనా గూగుల్ సెర్చ్ చేస్తున్న ఈ రోజుల్లో మోసగాళ్లు తెలివిగా ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారని తెలిపారు. వివిధ సంస్థలు, బ్యాంకులు, ఆసుపత్రులు, సర్వీస్ సెంటర్ వివరాల కోసమే కాకుండా వివిధ కస్టమర్ కేర్ నంబర్ల కోసం కూడా గూగుల్‌లో సెర్చ్ చేయడం సర్వసాధరణంగా మారిందన్నారు.
ఈ క్రమంలో కొందరు కేటుగాళ్లు వివిధ బ్యాంకులు, ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్లను పోలిఉండేలా ఫేక్ వెబ్‌సైట్లను తయారు చేసి నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను సృష్టిస్తున్నారని తెలిపారు. ఏదైనా సమస్యపై కస్టమర్లు ఫోన్ చేసినప్పుడు వారి బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ సేకరించి క్షణాల్లోనే డబ్బు దోచేస్తున్నారని వివరించారు. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లతో జాగ్రతగా ఉండాలన్నారు.
ఈ జాగ్రతలు పాటించండి
► ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆయా కంపెనీలకు సంబంధించిన యాప్ లేదా అధికారిక సైట్‌లో మాత్రమే కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేయాలి.
► గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లలో లేదా ట్రూ కాలర్ లాంటి యాప్స్‌లో కస్టమర్ కేర్ సంప్రదింపుల కోసం సెర్చ్ చేయవద్దు.
► కాల్ సెంటర్ నుంచి ఎవరైనా మీ బ్యాంకు ఖాతా వివరాలు, లాగిన్ ఐడీలు, పాస్ వర్డ్‌లు, పిన్, ఓటీపీలు అడిగితే పొరపాటున కూడా ఇవ్వరాదు. బ్యాంకింగ్ సంస్థలు ఎప్పుడూ మీ వివరాలను అడగవు.
►రీఫండ్ వస్తుందని కొన్ని కాల్‌సెంటర్ల నుంచి ఓ లింక్ పంపించి దానిపై క్లిక్ చేసి బ్యాంకు అకౌంట్, ఓటీపీ, పాస్‌వర్డ్ తదితర వివరాలు నమోదు చేయాలని అడిగితే అసలు చేయవద్దు.
► ఈ తరహా సైబర్ నేరం జరిగినట్లు గుర్తించిన వెంటనే హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలి. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment