
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ మలిక గర్గ్
ఒంగోలు టౌన్: హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి గుంటూరుకు చెందిన దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిర్వాహకులు రాజేంద్రప్రసాద్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మోసం చేసినట్లు కనిగిరికి చెందిన ఆర్ హరినారాయణ ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఆయన ఎస్పీ మలికాగర్గ్‌కు ఫిర్యాదు అందజేశారు. తనతో పాటుగా మరో ఇద్దరి నుంచి రూ.5 లక్షల చొప్పున వసూలు చేశారని, ఉద్యోగాలు రాకపోవడంతో తమ వద్ద నుంచి తీసుకున్న డబ్బుల ఇవ్వమని అడిగితే జవాబు ఇవ్వడం లేదంటూ ఎస్పీతో మొర పెట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో తమను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని కోరారు. మా ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి మిగిలిన పోర్షన్లలో నివాసం ఉంటున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అద్దె కూడా చెల్లించకుండా వేధిస్తున్నాడని ఒంగోలు నిర్మల్‌నగర్‌కు చెందిన ఒక భవన యజమాని ఫిర్యాదు చేశారు. స్పందనకు మొత్తం 83 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై ఆయా పోలీసుస్టేషన్ల అధికారులతో మాట్లాడి స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు స్పందన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు.
పోలీసు స్పందనకు 83 ఫిర్యాదులు స్పందన ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ మలికాగర్గ్ ఆదేశాలు