సింగరాయకొండ: ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును క్రాస్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొన్న ఘటనలో మోటారుసైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో సింగరాయకొండ మండల పరిధిలోని మలినేని సుశీలమ్మ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో కందుకూరు రోడ్డుపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని యర్రగుంటపాలేనికి చెందిన ఎలిక సాయికుమార్ (27), బండపాలేనికి చెందిన నాయుడు మహేష్ (28) మోటారుసైకిల్‌పై కందుకూరు నుంచి సింగరాయకొండవైపు వెళ్తున్నారు.
మోటారుసైకిల్ పలుకూరు అడ్డరోడ్డు దాటి నెల్లూరు జిల్లా సరిహద్దు నుంచి ప్రకాశం జిల్లాలోకి రాగానే ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును క్రాస్ చేసి ముందుకెళ్లే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో మోటారుసైకిల్‌పై ప్రయాణిస్తున్న సాయికుమార్, నాయుడు మహేష్‌లకు తీవ్రగాయాలు కావడంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. కొనఊపిరితో ఉన్న మహేష్‌ను, సాయికుమార్ మృతదేహాన్ని కందుకూరు ఏరియా ఆస్పత్రికి ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించారు. మహేష్‌కు చికిత్స చేసే ప్రయత్నం చేశారు.
కానీ, అప్పటికే మహేష్ కూడా మరణించాడు. ఈ ఘటనలో మోటారుసైకిల్ పూర్తిగా ధ్వంసమైంది. సాయి, మహేష్ ఇద్దరూ యర్రగుంటపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానితులను పిలవడానికి సింగరాయకొండ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సాయి బంధువులు తెలిపారు. సాయి కందుకూరులోని హరిణి ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక చెల్లెలు ఉంది. చేతికందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు మృత్యువాతపడటంతో సాయి తండ్రి మాధవరావు ఆవేదన చూపరులను కలచివేసింది.
ఇటీవల వీరు నూతనంగా ఇల్లు నిర్మించుకుని గృహ ప్రవేశం కూడా చేశారు. నాయుడు మహేష్ ఇటీవల వరకు హైదరాబాద్‌లో ఉండి ప్రస్తుతం కందుకూరు వచ్చి ఆటో నడుపుకుంటూ వాయిదా పద్ధతిపై ఫర్నిచర్ అమ్ముతుంటాడు. ఇతనికి వివాహమైంది. ప్రమాదం జరిగిన స్థలాన్ని సీఐ దాచేపల్లి రంగనాఽథ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీరామ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment