రాయపాటి అరుణపై దాడి | - | Sakshi
Sakshi News home page

రాయపాటి అరుణపై దాడి

Published Tue, Mar 12 2024 7:35 AM | Last Updated on Tue, Mar 12 2024 9:00 AM

- - Sakshi

నేతల మధ్య ముదిరిన ఆధిపత్య పోరు 

జనసేన మహిళా నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణపై జిల్లా అధ్యక్షుని వర్గం దాడి 

కులం పేరుతో దూషించి.. చంపుతానని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు

టీడీపీ–జనసేన సమన్వయ కమిటీ వేదికగా దాడికి ప్లాన్‌ 

మహిళా నేత మీద దాడిపై స్పందించని అధిష్టానం

ఎన్నికల తరువాత చూద్దామంటూ ఈజీగా తీసుకున్న పవన్‌

విస్తుపోతున్న పార్టీ కేడర్‌

జనసేనలో నేతల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడింది. ఒకరిపై ఒకరు ఆరోపణలుచేసుకునే స్థాయి దాటి దాడి చేసే వరకూ వచ్చింది. మహిళానేతపై దాడి చేసి అడ్డువచ్చిన వారిని జిల్లా అధ్యక్షుడి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళ అని చూడకుండా ఆమైపె చేయి చేసుకున్నారు. నడిరోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ దృషికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా..పోత్తులతో బిజీగా ఉన్నాం.. ఎన్నికలు ముగిసిన తర్వాత చూసుకుందాంలే అంటూ ఈజీగా తీసుకున్నారు. అధినేత తీరుపై పార్టీ కేడర్‌ విస్తుపోతోంది. జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ వర్గానికి మాజీ ఎమ్మెల్యే దామచర్ల అండదండలు ఉండడంతో పేట్రేగి పోతున్నారని బాధితురాలి వర్గం ఆరోపిస్తోంది. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా జనసేనలో గ్రూపు తగాదాలు రోడ్డెక్కాయి. జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ , పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మధ్య పొసగడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా సోషల్‌ మీడియా వేదికల మీద ఒకరి మీద మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం, సవాళ్లు విసురుకోవడం జరుగుతోంది. పార్టీకి సంబంధించి జిల్లాలో పెత్తనం సాగిస్తున్న రియాజ్‌ వర్గం పార్టీ సమావేశాలకు అరుణను ఆహ్వానించడం లేదు. ఒకవేళ పిలిచినా ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వక పోవడం, చేతిలో ఉన్న మైకును సైతం లాక్కోవడం చేస్తున్నారు. ఎస్సీ మహిళ అని కూడా చూడకుండా తరచుగా అవమానాలకు గురిచేస్తున్నారు. ఈ విషయం గురించి అనేక సార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు దామచర్ల జనార్దన్‌ అండతో రియాజ్‌ వర్గం పేట్రేగిపోతోందని అరుణ వర్గం ఆరోపిస్తోంది.

టీడీపీ, జనసేన సమన్వయ సమావేశంలోనే దాడికి ప్లాన్‌...
ఆదివారం ఒంగోలులోని పీఏజీ కన్వెన్షన్‌ హాలులో టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన అరుణను ప్రొటోకాల్‌ ప్రకారం వేదికపైకి ఆహ్వానించాల్సి ఉంది. అయితే ఆమెను పిలవలేదు సరికదా, కనీసం ప్రసంగించే అవకాశం కల్పించకుండా అవమానాలకు గురిచేశారు. సమావేశంలో ఎక్కడో చివరన ఆమెకు సీటు కేటాయించారు. దీనిని ఆమె ప్రశ్నించి ఉంటే సమావేశంలోనే దాడికి ప్లాన్‌ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె మౌనంగా అక్కడి నుంచి వెళ్లి పోయారు. దాంతో అదే రోజు సాయంత్రం నాగులుప్పలపాడు మండలంలో జరిగే జెండా విష్కరణ కార్యక్రమంలో అరుణ మీద దాడి చేయాలని కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇదంతా జనార్దన్‌ కనుసన్నల్లోనే జరిగినట్లు అరుణ వర్గానికి చెందిన పలువురు జనసేన కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కారును వెంబడించి... ఛాతిపై దాడి చేసి
నాగులప్పలపాడు మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ జండావిష్కరణ కార్యక్రమానికి సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే విజయ్‌ కుమార్‌తో కలిసి అరుణ వెళ్లారు. కార్యక్రమాలు పూర్తయ్యే సరికి రాత్రి 9 గంటలు దాటింది. తిరుగు ప్రయాణంలో దాసరివారిపాలెం గ్రామ శివారు వద్ద రియాజ్‌ అనుచరులు రాంబాబు, మాత్యాల కళ్యాణ్‌ తదితరులు అరుణ ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. అరుణ అనుచరుడు చరణ్‌ మీద దాడికి దిగారు. అక్కడ నుంచి తప్పించుకొన్న అరుణ కారును వెంబడించారు. కనపర్తి గ్రామం వద్దకు రాగానే కారును ఆపి అరుణపై దాడికి దిగారు. ఛాతీపై చేయ్యేసి పిడిగుద్దులు కురిపించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ..నిన్ను చంపేస్తా అంటూ బెదిరించారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరిగినట్లు ఆమె ఆరోపిస్తున్నారు.

అధ్యక్ష్యా ఇలా అయితే ఎలా..
రాష్ట్ర అధికార ప్రతినిధి మీద దాడి జరిగినా ఖండించకపోవడమే కాకుండా ఇప్పుడు పొత్తులతో బిజీగా ఉన్నాను. ఎన్నికల తరువాత కూచొని మాట్లాడుదాంలే అని చెప్పడం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ చెప్పడం కార్యకర్తలు, నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర నాయకురాలికే పార్టీలో భద్రత లేకపోతే సామాన్య మహిళా కార్యకర్తల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రియాజ్‌, అరుణ వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు చెక్‌ పెట్టకుండా ఉండడం వల్లనే నేడు దాడుల వరకు పరిస్థితి వెళ్లిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు జనార్దన్‌ జనసేన నాయకులను తరచుగా అవమానిస్తున్నప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల కార్యకర్తలు మనస్తాపం చెందుతున్నారు. పార్టీలో సాక్షాత్తూ మహిళపై దాడి జరిగినా అధిష్టానం స్పందించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దాడిని పట్టించుకోని జనార్దన్‌ ...
జనసేనలో గ్రూపుల గొడవలను దామచర్ల జనార్దన్‌ రాజేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేనలో జరుగుతున్న గ్రూపు తగాదాల్లో ఆయన ఒక గ్రూపును ప్రోత్సహిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అరుణ మీద దాడి జరిగిన తరువాత చికిత్స కోసం ఆమె నేరుగా జీజీహెచ్‌కు వచ్చారు. అరుణ మీద జరిగిన దాడిని కనీస మర్యాదగా కూడా ఖండించలేదు. జీజీహెచ్‌లో చికిత్స తీసుకుంటున్నా అరుణను పరామర్శించలేదు. కావాలనే రియాజ్‌తో కలిసి సోమవారం జీజీహెచ్‌కు వచ్చిన ఆయన ఒక మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు. ఒక ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళ అని కూడా చూడకుండా ఆయన వ్యవహరించిన తీరుపట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిజానికి ఒంగోలు టీడీపీ అభ్యర్ధిగా జనార్దన్‌ పేరును ప్రకటించిన వెంటనే ఆయన ఇంటికి వెళ్లి అరుణ అభినందిచారు. అదికూడా జనార్దన్‌ పట్టించుకోకుండా రియాజ్‌ వర్గాన్ని వెనుకేసుకుంటూ వస్తున్నారని జనసేన కార్యకర్తలు విమర్శిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement