బాలికల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
మార్కాపురం: బాలికల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. గురువారం మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాలులో సబ్‌కలెక్టర్ వెంకట సహదిత్ త్రివినాగ్‌తో కలిసి బంగారు బాల్యం కార్యక్రమం అమలుపై ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు, సచివాలయ సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలల సమగ్ర ఎదుగుదలకు అందరూ కృషి చేయాలన్నారు. బాల్య వివాహాలను నివారించి బాలికా సాధికారత దిశగా బంగారు బాల్యం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. బాలల హక్కులు, చట్టాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహాలు నిరోధిస్తూనే పౌష్టికాహార లోపం నివారించే స్థాయి నుంచి బాలికల బంగారు భవిష్యత్తు అందించే వరకు అందరం కృషిచేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. పాఠశాలల్లో విద్యార్థినుల డ్రాపవుట్స్ కూడా నివారించాలన్నారు. ఇందుకోసం జిల్లాలో ప్రతి పాఠశాలకు ఒక టీచరును నోడల్ ఆఫీసరుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశామన్నారు.పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పలు విషయాలను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హీనా సుజన్, డీసీపీఓ దినేష్‌కుమార్, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, డీఎల్‌డీఓ శ్రీనివాసరెడ్డి, సార్ట్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సునీల్, తహసీల్దార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టండి...
పశ్చిమ ప్రకాశంలోని ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి మార్కాపురంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సబ్‌కలెక్టర్ త్రివినాగ్‌తో కలిసి తాగునీటి సమస్యపై సమీక్షించారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రధానంగా ఫిబ్రవరి 1 నుంచి చేతిపంపుల మరమ్మతులను ప్రారంభించి 45 రోజుల్లో పూర్తిచేయాలని చెప్పారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. సీపీడబ్ల్యూఎస్, ఎంపీడబ్ల్యూఎస్, తదితర పథకాల కింద ఉన్న చేతిపంపులను గుర్తించి వాటికి అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో అవకతవకలు జరగకుండా చూడాలని అఽధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన బిల్లులు త్వరగా చెల్లించేలా చూడాలని, ఈ వివరాలన్నీ యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాలో అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో ఆర్‌డబ్ల్యూఎస్ ఇన్‌చార్జి ఎస్‌ఈ బాలశంకర్, డీఎల్‌డీఓ శ్రీనివాసరెడ్డి, మార్కాపురం మున్సిపల్ కమిషనరు నారాయణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, ఈఓపీఆర్‌డీలు పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా మార్కాపురంలో అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment