
ఆలస్యంగా త్రిపురాంతకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
త్రిపురాంతకం: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, రుత్వికరణం, పంచగవ్యప్రాశనలతో ప్రారంభం కావాల్సిన బ్రహ్మోత్సవాలు రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణ జరగాల్సి ఉంది. మహాశివరాత్రి పండుగకు రెండు రోజుల ముందు స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తులు ఉదయం నుంచి వేచి ఉండి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు అక్కడికి చేరి త్రిపురాంతకేశ్వర స్వామి, బాల త్రిపుర సుందరి ఆలయాల్లో జరిగే విశేష అర్చనలు, రుద్రహోమం, బలిహరణలు, మధ్యాహ్నం జరిగే విశేష పూజలు, ప్రదోషకాల పూజ, రాత్రి 7గంటలకు రుద్రహోమం, బలిహరణలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆలయ కార్యనిర్వహణాధికారిణి డి.రజనీ కుమారి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలోకి రాలేదు. అప్పటి వరకు వేచి ఉన్న ఆలయాల కమిటీ సభ్యులు, సిబ్బంది ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. చివరకు ఆమె ఆలస్యంగా రావడంతో బ్రహ్మోత్సవాలు కూడా 12 గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో కార్యనిర్వహణాధికారిణి సాంప్రదాయ దుస్తులతో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆమె పంజాబి డ్రస్ ధరించి, తలపై కళ్లద్దాలు పెట్టుకొని దర్శనం ఇవ్వడంతో భక్తులు అవాక్కయ్యారు. ఆమె తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
12 గంటలు ఆలస్యంగా ప్రారంభించిన వైనం ఈఓ అందుబాటులో లేకపోవడంతో జాప్యం సాంప్రదాయ దుస్తులను విస్మరించిన ఆలయ ఈవో రజనీకుమారి ఈవో తీరుపై మండిపడుతున్న భక్తులు
Comments
Please login to add a commentAdd a comment