
రైతుల ఊసు పట్టని చంద్రబాబు
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య విమర్శించారు. స్థానిక మల్లయ్యలింగం భవన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు మద్దతు ధర ఇచ్చే విషయంలో కేరళ అగ్రస్థానంలో ఉండగా ఆ తరువాత స్థానంలో పంజాబ్ నిలిచిందని తెలిపారు. ఎన్నికలకు ముందు రైతు భరోసా ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు కూటమి ప్రభుత్వం మద్దతు పలకడం దుర్మార్గం అన్నారు. కేంద్ర మద్దతు ధరలకు అదనంగా పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బోనస్ ప్రకటించకుండా రైతులను మోసం చేసిందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 5 నుంచి 10 వ తేదీ వరకు దేశంలోని అన్నీ రాష్ట్రాలతో పాటుగా మన రాష్ట్రంలోనూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో మద్దతు ధరపై తీర్మానం చేసేలా రాష్ట్రం మీద ఒత్తిడి తెస్తామన్నారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం రూ.171 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇది బడ్జెట్లో మూడు శాతమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని క్వింటాలు మిర్చి మద్దతు ధర రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లు కేటాయించాలని కోరారు. ఏప్రిల్ లో అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు తమిళనాడు లోని నాగపట్నంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో వెలిగొండ ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు కేటాయించి నిర్వసితులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే.వీరా రెడ్డి డిమాండ్ చేశారు. సమావేశం లో రైతు సంఘం నాయకులు ఉప్పుటూరి ప్రకాశ రావు, కరవది సుబ్బారావు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య
Comments
Please login to add a commentAdd a comment