బాలల సంరక్షణకు సమన్వయంతో పనిచేయాలి
ఒంగోలు సిటీ: రాజ్యాంగ వ్యవస్థలోని అన్ని చట్టాలను సమర్ధవంతంగా అమలు చేసి బాలల సంరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాల్‌లో బుధవారం ఉదయం బాలల సంరక్షణకు సంబంధించిన వివిధ కార్యక్రమాల పురోగతిపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల మానసిక శారీరక ఎదుగుదలతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నట్లు తెలిపారు. బాలల సంరక్షణ లక్ష్యంగా అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అపహరణ, బాలికలపై లైంగిక దాడులు వంటి అమానవీయ సంఘటనలు జరగకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని, జిల్లాలోని బాల బాలికలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించామన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనా సుజన్, జిల్లా కార్మిక శాఖ కమిషనర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, ఐసీడీఎస్ వివిధ విభాగాల అధికారులు, బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.
● జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమానికి అధికారులు దృష్టి సారించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అన్నారు. సంక్షేమ శాఖ, వసతి గృహాల సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలు అనేక ఇబ్బందులకు, మానసిక వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమ వసతి గృహాలు ఉండే పిల్లలకు, పాఠశాలలో పాఠ్యాంశాలతో పాటు బాలల చట్టాలపై కూడా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్ నరసింహస్వామి, ఎస్టీ, బీసీ సంక్షేమ అధికారి అంజలి, వికలాంగుల శాఖ అధికారి అర్చన, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి
Comments
Please login to add a commentAdd a comment