రీ సర్వే పారదర్శకంగా నిర్వహించాలి
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
పామూరు: భూ రీసర్వే పనులను రెవెన్యూ సర్వే సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. మండలంలోని చింతలపాలెంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో కనిగిరి ఆర్డీఓతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రీసర్వే జరుగుతున్న తీరుపై తహసీల్దార్, మండల సర్వేయర్‌లతో చర్చించి మ్యాప్‌లను పరిశీలించారు. భూ రీసర్వేపై స్థానిక రైతులతో చర్చించి సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. భూ రీసర్వే రైతులకు మంచి అవకాశమని, రైతులు తమ పొలాలకు చెందిన పత్రాలు సర్వే సిబ్బందికి ఇచ్చి తమ పొలాల హద్దులను ఏర్పాటు చేయించుకోవాలన్నారు. భూ రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాటు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తే ఉపేక్షించమని సిబ్బందికి సూచించారు. రీసర్వే నిర్దేశిత సమయం లోగా పూర్తిచేయాలని తహసీల్దార్, మండల సర్వేయర్‌లను ఆదేశించారు. ఏడీ జిల్లా సర్వే గౌస్‌బాషా, తహసీల్దార్ బీవీ రమణారావు, మండల సర్వేయర్ కే.స్నేహ, వీఆర్‌ఓ జె.సరస్వతి, సచివాలయ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment