గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టింది. 2015 వరకు ఉపాధి హామీ పథకం వ్యవహారాలన్నీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సాఫ్ట్‌వేర్‌లో జరిగేవి. ఇవి పారదర్శకంగా లేకపోవడంతో గత ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సాఫ్ట్‌వేర్‌కు మార్చింది. దీంతో పాటు శ్రమశక్తి సంఘాలు, మేట్ల వ్యవస్థకు మంగళం పాడింది. ఫలితంగా పెద్ద ఎత్తున అక్రమాలకు చెక్ పెట్టినట్లయింది.
బేస్తవారిపేట:
కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో శ్రమశక్తి సంఘాల ఏర్పాటు, మేట్ల వ్యవస్థను తీసుకొచ్చి అక్రమాలకు రాచమార్గం వేసింది. ఫలితంగా ఈ పథకం లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు బోగస్ మస్టర్లతో కూలీల పొట్టకొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పనులను కూడా కేవలం కూటమి సానుభూతిపరులకే కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2014–19 వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో అక్రమాలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంపొనెంట్ పనుల్లో 50 శాతం నిధులు స్వాహా చేశారని కూలీలే చెప్పుకున్నారు. అప్పడు కూడా శ్రమశక్తి సంఘాలు, మేట్లను ఏర్పాటు చేసి దోచిపెట్టారు. పనులు చేయకుండా ౖపైపె పూతలతో బిల్లులు చేసుకుని జేబులు నింపుకున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో మొత్తం 4.41 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. అందులో 3.82 లక్షల కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయి. 8.13 లక్షల మంది కూలీలు ఉండగా, వీరిలో 6.78 లక్షల మంది కూలీలు యాక్టివ్‌గా ఉన్నారు. 6.78 లక్షల మంది కూలీలకు 13,560 మంది మేట్లను నియమించే అవకాశం ఉంది. అయితే, 1,01,750 మంది కూలీలకు 2,631 మేట్లను నియమించారు. ఉపాధి హామీ నిధులతో సీసీ, బీటీ రోడ్ల పనులు, గోకులం షెడ్లు, పచ్చ గడ్డి పెంపకం, ఇంకుడు గుంతల పనులన్నీ అధికార కూటమి నేతలు తమకు నచ్చిన వారికి కేటాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మేట్ పేరుతో దోపిడీ...
జిల్లాలో ఇప్పటివరకూ 2,631 శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘంలో 25 నుంచి 50 మంది ఉంటారు. ఇందులో ఒకరిని లీడర్‌గా నియమిస్తారు. ఆయన్ను మేట్ అంటారు. కూలీలను పనికి తీసుకెళ్లే బాధ్యత మేట్‌దే. మేట్ కూడా కూలీలతో పాటు పనిచేయాల్సిందే. కానీ, పనిచేయకుండానే వేతనం పొందుతారని కూలీలే చెబుతున్నారు. కూలీలపై అజమాయిషీ చెలాయిస్తారు. ఉపాధి కూలీల హాజరు, ఆన్‌లైన్ చేయడం, వేతనాల సిఫార్సు మొత్తం వీరే చేస్తారు. తమకు నచ్చిన వారికి పని కల్పించడం, పనులకు హాజరుకాకపోయినా మస్టర్లు వేయడం, ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. కొత్తగా నియమించే మేట్లు అందరూ టీడీపీ కార్యకర్తలే ఉండాలని ఎమ్మెల్యేలు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. రెండువారాల కిందట ఈ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో ప్రక్రియ మొత్తం పూర్తి చేయడానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్లు, శ్రమశక్తి సంఘాల లీడర్ల ఆధ్వర్యంలోనే ఉపాధి పనులు జరుగుతాయి. ఇప్పటికే అనేక చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి కూటమి కార్యకర్తలను నియమించారు. లీడరుగా ఉన్నందుకు మేట్‌కు ఒక కూలీపై రోజుకు రూ.1.50 చొప్పున చెల్లిస్తారు. యాక్టివ్‌గా ఉన్న కూలీలు 6.78 లక్షల మంది. దానిప్రకారం రోజుకు మేట్లకు సుమారు రూ.10.17 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 100 రోజులకు దాదాపు రూ.10 కోట్లపైనే వీరికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా కూటమి ప్రభుత్వం దోపిడీకి తెరతీసింది.
శ్రమశక్తి సంఘాలు, మేట్లపేరుతో అక్రమాలకు రాచమార్గం మేట్లకు గౌరవ వేతనం పేరుతో రూ.కోట్లు స్వాహా వారి చేతిలోనే హాజరు, ఆన్‌లైన్, కూలీల వేతనాల సిఫార్సు అధికార పార్టీవారే ఉండాలంటూ ఎమ్మెల్యేల ఆదేశం త్వరలో పూర్తికానున్న ప్రక్రియ అక్రమాల కారణంగా ఈ వ్యవస్థను ఎత్తేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment