పొగాకు వేలం ప్రారంభం
ఒంగోలు సబర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం నుంచి పొగాకు వేలం ప్రారంభమైంది. ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్టలో ఉన్న ఒంగోలు–1 వేలం కేంద్రంతో పాటు కొండపి, పొదిలి వేలం కేంద్రాల్లో ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కందుకూరు వేలం కేంద్రంలో కూడా ప్రారంభమైంది. మిగతా ప్రకాశం జిల్లాలోని 5 వేలం కేంద్రాలు, నెల్లూరు జిల్లాలోని 2 వేలం కేంద్రాల్లో ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. అయితే మొదటి రోజు నాలుగు వేలం కేంద్రాల్లో కలిపి 81 బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. వేలంలో 15 పొగాకు కంపెనీలు పాల్గొన్నాయి. అన్ని వేలం కేంద్రాల్లో అత్యధికంగా కిలో పొగాకు ధర రూ.280, అత్యల్ప ధర రూ.278 పలికింది.
పొగాకు వేలం కేంద్రాన్ని ప్రారంభించిన బోర్డు ఈడీ శ్రీధర్ బాబు
సంతనూతలపాడు: మండలంలోని పేర్నమిట్టలో ఉన్న ఒంగోలు 1వ పొగాకు వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. తొలిరోజు కిలో గరిష్ట ధర రూ.280 పలికింది. మొదట వేలం కేంద్రంలో జరిగిన ప్రారంభ పూజల్లో ఆయన పాల్గొని చిలంకూరుకు చెందిన 18 పొగాకు బేళ్లను మొదటి రోజు వేలానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పొగాకుకు డిమాండ్‌ను బట్టి ధరలు వస్తాయన్నారు. కరోనా కాలంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో పొగాకు ఉత్పత్తి లేక గత ఏడాది మంచి ధరలు లభించాయన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయంగా పలు దేశాల్లో పొగాకు ఉత్పత్తి చేశారన్నారు. ఈ ఏడాది పొగాకుకు ఖర్చులు పెరిగిపోయాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పొగాకు బయ్యర్స్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ ఏడాది కూడా పొగాకుకు తగు మేరకు ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. పొగాకు వేలాన్ని ఆక్షన్ సూపరింటెండెంట్ ఎం.రవికాంత్ పర్యవేక్షించారు. రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైతు సంక్షేమ భవన్, పొగాకు బోర్డు కార్యాలయాలకు ఈడీ శంకుస్థాపన చేశారు. రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈడీ అద్దంకి శ్రీధర్ బాబును రైతు కమిటీ నాయకులు ఆళ్ల సుబ్బారావు, ఫ్లోర్ కమిటీ అధ్యక్షుడు సూరం గురువారెడ్డి, తదితరులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ ఎం లక్ష్మణరావు, పొగాకు బోర్డు డైరెక్టర్ పొద వరప్రసాదరావు, మాజీ డైరెక్టర్ పి.బద్రిరెడ్డి, ఐటీసీ లీఫ్ మేనేజర్ శివకుమార్, జీపీఐ ప్రతినిధులు ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు 1, 2 వేలం కేంద్రాల రైతు కమిటీ అధ్యక్షులు ఎస్ గురువారెడ్డి, వి ప్రసాద్, రైతు కమిటీ నాయకులు ఆళ్ల సుబ్బారావు, వడ్డం పూడి వెంకటేశ్వరరావు, జి సుబ్రమణ్యం, లింగంగుంట వెంకటేశ్వర్లు, మేకల కృష్ణారెడ్డి, ఎం వెంకటనారాయణ, కరిచేటి సుబ్బారావు, ఎన్ మస్తాన్ రెడ్డి, ఆళ్ల రవి, వరహాల చౌదరి, బోర్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 4 వేలం కేంద్రాల్లో మొదలు మిగతా ఏడు కేంద్రాల్లో ఈ నెల 19 నుంచి ప్రారంభం కిలో అత్యధిక ధర రూ.280, అత్యల్పం రూ.278
పొగాకు వేలం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment