అర్ధరాత్రి కరెంటు.. అన్నీ కష్టాలే..
కురిచేడు మండలం కాటంవారిపల్లె గ్రామానికి చెందిన నుసుం నాగిరెడ్డి 5 ఎకరాల్లో మిరపపంట సాగు చేశాడు. ఎకరానికి సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. 9 గంటలు కరెంటు ఇస్తామని చెప్పి 7 గంటలు ఇస్తున్నారు. మిగతా 2 గంటలు రాత్రి 10–12 వరకు ఇస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆపిన కరెంటు రాత్రి 10 గంటలకు ఇచ్చే సరికి ఎండకు ఉదయం పెట్టిన నీరు ఇంకిపోతున్నాయి. సరిపడా నీళ్లు అందక పోవడంతో పంటలు ఎండిపోతున్నట్టుగా తయారవుతున్నాయి. పైగా తెల్లవారు జామున 4 గంటలకు కరెంటు ఇస్తుండడంతో మూడు గంటలకు లేచి పొలం వెళ్లాల్సి వస్తోంది. అర్ధరాత్రి పొలంలో విషసర్పాలు తిరుగుతుంటాయి. ఏ టైంలో ఏం జరుగుతుందోననే భయంగా..భయంగా పొలానికి వెళ్లాల్సి వస్తోంది. రాత్రి పూట అనేసరికి కూలీలకు రెట్టింపు రేట్లు చెల్లించాల్సి వస్తోంది. 11 గంటలకు కరెంటు ఆగిపోతే పగలంతా పనులు చేసుకుని, మళ్లీ రాత్రిపూట రోజూ నిద్రకాయటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని నాగిరెడ్డి వాపోతున్నాడు. ప్రభుత్వ చర్యలతో అన్ని విధాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
వేళాపాళాలేని కోతలతో ఇబ్బంది పడుతున్నాం..
నేను 27 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశాను. పొగాకు 7 ఎకరాలు, నిమ్మ 4 ఎకరాలు, బొబ్బర్లు 6 ఎకరాలు, మినుము 4 ఎకరాలు, కంది 6 ఎకరాల్లో సాగు చేశాను. వ్యవసాయానికి ఉదయం 8:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పగటిపూట తొమ్మిది గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలి. అప్పుడే రైతులు తమ పొలాల్లో నీరు పెట్టుకుంటారు. ఇటీవల కాలంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రిపూట సరఫరా చేయటం వల్ల నీరు పెట్టుకోవటం ఇబ్బందిగా ఉంది. కరెంట్ కోతలతో సరఫరా ఇలా కొనసాగితే పొగాకు, నిమ్మ పంటలు దెబ్బతింటాయి.
– రామాంజనేయ రెడ్డి, రైతు, పొదిలి మండలం బట్టువారిపల్లి
రాత్రి పూట జాగారం..
గత ఏడాది మిర్చి 5 ఎకరాలు సాగు చేశాను. మాది వర్షాధారం. బోర్ ద్వారా పైరుకు నీటి తడి ఇస్తాను. అయితే పగటి పూట విద్యుత్ ఒక్కొక్క సారి నిరంతరం 9 గంటలు ఇవ్వడం లేదు. ఇలా ఇవ్వని రోజు రాత్రి పూట ఇస్తారు. దీంతో రాత్రి పూట పొలాలకు వెళ్లి నీటి తడులు పెట్టుకుంటూ జాగారం చేస్తాను. మేము కోరేది ఒకటే..రోజూ ఎటువంటి అంతరాయం లేకుండా పగటి పూట 9 గంటల విద్యుత్ ఇవ్వాలి.
– ఎన్.వెంకటేశ్వర్లు, రైతు, కొనకనమిట్ల మండలం గొట్లగట్టు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లా వ్యాప్తంగా 2,36,866 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ సీపీడీసీఎల్) ఎలాంటి ప్రకటనలు చేయకుండానే అనధికారిక కోతలకు శ్రీకారం చుట్టాయి. జిల్లాలో 680 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లు ఉన్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను ఏ, బీ గ్రేడులుగా విభజించించారు. ఏ గ్రేడులో ఉదయం గం.8.45 నుంచి సాయంత్రం గం.5.45 వరకు నిరంతరాయంగా ఇస్తున్నామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. బీ గ్రేడ్‌లో ఉదయం గం.9 నుంచి సాయంత్రం గం.6 వరకు సరఫరా చేస్తున్నామని అంటున్నారు.
వాస్తవానికి విరుద్ధంగా....
జిల్లాలో ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో అన్నిరకాల పంటలకు బోర్లే ఆధారం. అందుకు విద్యుత్ సరఫరా సక్రమంగా ఉంటేనే పంటలు పండుతాయి. పగటిపూట వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. మరో వైపు భూగర్భ జలాలు అడుగంటి పోతుండడం అన్నదాతను ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్న నీటినైనా ఉపయోగించుకొని సాగు చేసిన పంటలను పండించుకుందామంటే విద్యుత్ అంతరాయం పెద్ద సమస్యగా మారింది. పగటి పూట నిరంతరాయం అని చెప్పి విడతల వారీగా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాత్రింబవళ్లు అన్న తేడాలేకుండా సరఫరా ఇవ్వటంతో రాత్రి వేళల్లో కూడా రైతులు పొలాల్లో పంటలు తడుపుకోవటానికి పడిగాపులు కాయాల్సి వస్తోంది. పశ్చిమ ప్రకాశంలోని మండలాలతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రోజులో రెండు మూడు దఫాలుగా కరెంటు ఇస్తుండడంతో పంటలు సక్రమంగా తడవక రైతులు విలవిల్లాడుతున్నారు.
మెట్టకు బోర్లే ఆధారం..
పశ్చిమ ప్రకాశంలోని మండలాల్లో ఎక్కువ శాతం రైతులు ప్రధానంగా మిర్చి, శనగ, జొన్న, మొక్కజొన్న, సజ్జ, కందులు, మినుము, పెసర, నువ్వు, ఆవాలు, మామిడి, నిమ్మ, సపోట, బత్తాయి, సన్‌ఫ్లవర్, వేరుశనగ, పొగాకు, పత్తితో పాటు అనేక రకాల పంటలు సాగుచేస్తున్నారు. అన్ని రకాల పంటలకు వ్యవసాయ విద్యుత్ మోటార్ల ద్వారా అందించే బోరు నీరే ఆధారం. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోతే కీలక దశలో నీటి ఎద్దడి ఏర్పడి ఆయా పంట దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా చేస్తున్నామని అధికారులు చెబుతుండగా .. 7 గంటలు కూడా సక్రమంగా ఇవ్వటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదేమని అడిగితే లోడ్ రిలీఫ్ (ఎల్ ఆర్) ఇచ్చామంటూ విద్యుత్ అధికారులు, సిబ్బంది చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మెయిన్ సప్లై పోయిందని, ఎప్పుడొస్తుందో చెప్పలేమనే సమాధానం ఇస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి రోజూ రెండు గంటలకు పైగా అనధికారికంగా విద్యుత్ కోత విధిస్తున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మార్చి నెల దాటితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కనీసం 5 గంటల సరఫరా కూడా సక్రమంగా అందుతుందో లేదోననే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
విద్యుత్ కోతలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అనధికారికంగా రెండు గంటలు కోత బోర్ల ద్వారా పంటలకు నీరు అందక మాడిపోతున్న వైనం ప్రస్తుతం రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇవ్వడంతో అవస్థలు రాత్రి వేళల్లో పొలాల్లో కాపలా కాస్తున్న రైతన్నలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా
అర్ధరాత్రి కరెంటు.. అన్నీ కష్టాలే..
Comments
Please login to add a commentAdd a comment