రైతు వ్యతిరేక కుట్రలను తిప్పికొడతాం
● సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు
ఒంగోలు టౌన్: రైతాంగ ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రపూరిత దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు మార్చి 5వ తేదీ జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టరేట్ వద్ద, మార్చి 10 తేదీ గుంటూరులో నిర్వహించే రాష్ట్ర స్థాయి ధర్నాలను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని మాదాల నారాయణస్వామి భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న రైతు ఉద్యమాలను విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. గిట్టుబాటు ధరలపై కుదుర్చుకున్న ఒప్పందాలపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసేంత వరకు ఉద్యమం ఆగదన్నారు. రాష్ట్రంలో బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ పొగాకు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని, వ్యాపారులు గతేడాది కంటే 4 నుంచి 5 వేల వరకు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీనివలన రైతులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జామాయిల్, సుబాబుల్ కర్రలను పెరిగిన ధరలకు అనుగుణంగా కొనుగోలు చేయకుండా ఐటీసీ కూటమి మాటున వెయ్యి నుంచి రూ.1,500 తక్కువకు కొనుగోలు చేయడం దుర్మార్గమని ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి వీరారెడ్డి మండిపడ్డారు. ప్రకాశం, కృష్ణా జిల్లాల సుబాబుల్ రైతులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సాగు చేస్తున్న తేజ మిర్చికి గుంటూరు మిర్చి మార్కెట్‌లో 13 నుంచి 14 వేల రూపాయల ధర పలుకుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.11,781 మద్దతు ధర ప్రకటించడాన్ని తప్పుబట్టారు. విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రైతులను నిండాముంచేందుకేనని రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతిబాబు విమర్శించారు. సమావేశంలో భీమవరపు సుబ్బారావు, ఎంఎస్ సాయి, ఎల్.రాజశేఖర్, సీహెచ్ సాగర్ పాల్గొన్నారు.
ఓపెన్ ఇంటర్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి
ఒంగోలు సిటీ: 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను మార్చి 3 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ అత్తోట కిరణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం హాల్‌టికెట్లను ఆన్‌లైన్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీవోఎస్‌ఎస్.ఓఆర్‌జీ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment