సేవల్లేక జనం విలవిల.. ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాల!
అమ్మా రేషన్ కార్డు..
అయ్యా పింఛనెప్పుడు?
ఇంటింటి సర్వే, పింఛన్ల పంపిణీ సమయంలో ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు సచివాలయ ఉద్యోగుల వద్ద సమాధానం ఉండటం లేదు. ‘కొత్త పింఛన్లు రాస్తున్నారా అయ్యా.. రేషన్ కార్డు కోసం అప్లికేషన్ తీసుకుంటున్నారా అమ్మా..’ అంటూ ఆశగా అడుగుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ‘లేదు.. లేదు.. గవర్నమెంట్ ఇంకా సైటు వదల్లేదు’ అని చెప్పి ముందుకు కదులుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు గడిచినా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆధారమైన రేషన్‌కార్డుల మంజూరులో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. సచివాలయాల్లో దరఖాస్తులు పెట్టుకుని నెలలు గడుస్తున్నా కొత్త కార్డులు మంజూరు చేయకపోవడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, అన్నదాత సుఖీభవకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించకపోవడం ప్రభుత్వ పాలన తీరును తేటతెల్లం చేస్తోంది.
బేస్తవారిపేట:
గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. సుమారు 554 రకాల సేవలు అందిస్తున్న గ్రామ/వార్డు సచివాలయాలను కూటమి ప్రభుత్వం క్రమంగా దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న తీరు అటు ప్రజల్లోనే కాకుండా ఇటు ఉద్యోగుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాలను ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందజేయయుడమే లక్ష్యంగా 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1058 గ్రామ/వార్డు సచివాలయాలు ఏర్పాటు కాగా జిల్లాల విభజన అనంతరం ప్రకాశంలో ప్రస్తుతం 716 సచివాయాలున్నాయి. మొత్తం 5 వేల మందికి పైగా ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వీటిలో మూడొంతులకు పైగా భవనాలను ప్రభుత్వం సొంత నిధులు వెచ్చించి నిర్మించింది. ఒక్కో సచివాలయాన్ని రూ.45 లక్షలతో అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకం అమలు చేసినా సచివాలయ ఉద్యోగులతో పాటు వలంటీర్ల ద్వారా అందరికీ తెలియజేసి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ లబ్ధిదారులుగా ఎంపిక చేశారు.
నాడు కళకళ.. నేడు వెలవెల
తొమ్మిది నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే సచివాలయాల్లో సేవలకు గ్రహణం పట్టింది. సేవలను పూర్తిగా నీరుగార్చడంతో ప్రజలు తమ సమస్యలపై పొలోమంటూ మండల కేంద్రాల్లో అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అక్కడా పరిష్కారం కాకుంటే వ్యయ ప్రయాసలకోర్చి ఆర్డీఓలు, జిల్లా కేంద్రానికి వెళ్లి తమ బాధలు చెప్పుకొని వినతి పత్రాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో రోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య నిర్వహించే స్పందన కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకడమే ఈ దుస్థితికి కారణం. ప్రస్తుతానికి జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయకపోయినా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అనధికారికంగా కూటమి నాయకులే చూస్తుండటంతో సచివాలయాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాల్లో టీడీపీ, జనసేన నాయకుల మితిమీరిన జోక్యం కారణంగా అర్హులైన వారు అన్యాయానికి గురవుతుండగా.. కూటమి కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరుతోంది. ఉపాధి హామీ నిధులతో సబ్సిడీపై అందించే పశుగ్రాసం యూనిట్లు, గోకులం షెడ్ల నిర్మాణం, బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ రుణాల మంజూరు.. ఇలా ప్రతి పథకంలో నేరుగా కూటమి సానుభూతిపరునే లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇలాంటి పథకాలన్నీ సచివాలయాల ద్వారా పారదర్శకంగా జరిగేవని గ్రామాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కుల, ఆదాయ, ఫ్యామిలీ మెంబర్, బర్త్, డెత్ తదితర ధ్రువీకరణ పత్రాలకు సచివాయాల్లో దరఖాస్తు చేసుకున్నా మండల కేంద్రాల్లో అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని, లేదంటే ఆలస్యంగా ధ్రువీకరిస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సచివాలయాల సేవలకు
మంగళం పాడిన కూటమి ప్రభుత్వం
కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల
మంజూరుపై ఉద్యోగులను ప్రశ్నిస్తున్న జనం
కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలైనా తెరుచుకోని వెబ్‌సైట్లు
సర్వేల పేరుతో ఉద్యోగులను ఇంటింటికీ తరుముతున్న ప్రభుత్వం
గతంలో వలంటీర్లతో
సర్వే చేయించడాన్ని తప్పుబట్టిన
చంద్రబాబు అండ్ కో
‘సర్వే’శ్వరా..
గత ప్రభుత్వంలో వలంటీర్లతో సర్వేలు చేయించడాన్ని తప్పుబట్టిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు.. తాను అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. ఏకంగా సచివాలయ ఉద్యోగులను సర్వేల పేరుతో నిరంతరం తరుముతున్నారు. మొత్తం 15 రకాల ఇంటింటి సర్వేలతో సచివాలయాల ఉద్యోగులు కుస్తీలు పడుతున్నారు. ‘సర్వే చేస్తున్నాం.. ఓటీపీ చెప్పండి’ అని అడిగితే జనం చీదరించుకుంటున్నారని, తమకు కనీస గౌరవం లేకుండా పోతోందని ఉద్యోగులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. సెలవు రోజులతో సంబంధం లేకుండా సర్వేలు చేయాలని చెప్పడం, సర్వే పేరుతో టార్గెట్లు పెట్టడం, మరో వైపు మాతృశాఖల పనులు, బీఎల్‌ఓ విధులు ఇలా అన్ని రకాల పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి వరుసగా వస్తున్న ఆదేశాలతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. పని ఒత్తిడి తగ్గించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. సర్వేల పేరుతో ఇతర శాఖల అధికారులు వేధిస్తున్నారని, పరిస్థితి మారకుంటే ధర్నా చేస్తామంటూ ఏఎన్‌ఎంలు రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి నోటీసులివ్వగా మిగిలిన శాఖల ఉద్యోగులు సైతం ఇదే బాటను అనుసరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
సేవల్లేక జనం విలవిల.. ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాల!
సేవల్లేక జనం విలవిల.. ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాల!
Comments
Please login to add a commentAdd a comment