టీడీపీ కార్యకర్తలా ఏపీఎం!
● కోర్టు ఆదేశాలు బేఖాతరు
● వీఓఏలపై వైఎస్సార్ సీపీ ముద్రవేసి తొలగింపు
● కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు
ముండ్లమూరు(కురిచేడు): కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత చిరుద్యోగులపై వేధింపులు మొదలయ్యాయి. ఎలాంటి తప్పులు లేకపోయినా కూటమి నాయకులు కక్షగట్టి మరీ తప్పిస్తున్నారు. మండలంలో వీఓఏల పై ఏపీఎం హనుమంతరావు ఒక టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తూ వేధిస్తున్నారని చిరుద్యోగులు వాపోతున్నారు. టీడీపీ ముఖ్యనేతల నుంచి తనపై ఒత్తిళ్లు ఉన్నాయని, ఉద్యోగాల నుంచి వైదొలగాలని వీఓఏలను బలవంతం చేయటంతో కొందరు తప్పుకున్నారు. మరికొందరు కోర్టును ఆశ్రయించారు. తాజాగా మండలంలోని చిన్న ఉల్లగల్లు గ్రామ సంఘం వీఓఏగా పనిచేస్తున్న తప్పెట కృపమ్మను ఏపీఎం హనుమంతరావు, సీసీ రత్నకుమారి విధులు నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని వారిపై కృపమ్మ హైకోర్టులో కేసు వేశారు. ఆమె విధులకు ఆటంకం కలిగించకూడదని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అయినా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆన్‌లైన్ నుంచి తన పేరును తొలగించినట్లు కృపమ్మ తెలిపింది. ఆమేరకు మంగళవారం వెలుగు కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది.
ప్రభుత్వం మారిందని నన్ను తొలగించారు
ప్రభుత్వం మారిందని, టీడీపీ నాయకుల ఒత్తిళ్లు తనపై ఉన్నాయని నన్ను ఏపీఎం హనుమంతరావు, సీసీ రత్నకుమారి మానుకోవాలని నిత్యం ఒత్తిడి చేస్తున్నారు. వారి ఒత్తిడి తట్టుకోలేక హైకోర్టులో వారిపై కేసు వేసి ఇంజక్షను ఆర్డర్ తెచ్చుకున్నాను. అయినా కూడా రూ.20 వేలు ఇవ్వాలని, ఇస్తే ఉంచుతానని ఏపీఎం డిమాండ్ చేశారు. అవి ఇచ్చేందుకు నావద్ద లేవని చెప్పటంతో నాపేరు ఆన్‌లైన్ నుంచి తొలగించారు. కోర్టు ఆర్డరు తెచ్చుకున్నా మీరు ఉద్యోగం ఎలాచేస్తారో చూస్తానంటూ బెదిరిస్తున్నారు. కోర్టు ధిక్కారం కింద ఏపీఎం, సీసీపై కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయండి.
– తప్పెట కృపమ్మ, వీఓఏ
మేము తొలగించలేదు
కృపమ్మను ఉద్యోగం నుంచి తొలగించలేదు. 10వ తేదీ వరకు విధులు నిర్వహించింది. కోర్టు ఇంజక్షను ఆర్డర్ తెచ్చినా మేము ఏమీ అనలేదు. ఆ తరువాత కోర్టు ధిక్కరణ కింద మాపై మళ్లీ కోర్టుకి వెళ్లింది. అందువలన ఆమె లాగిన్ ఆన్‌లైన్‌లో ఇన్ యాక్టివ్ చేశాం.
– ఏపీఎం హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment