నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఒంగోలు సిటీ: మార్చి 1వ తేదీ నుంచి జిల్లాలో ప్రారంభమవుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని ఇంటర్‌బోర్డు ఆర్‌ఐవో సైమన్ విక్టర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌ఐవో సైమన్ విక్టర్ మాట్లాడుతూ మొదటిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులతో పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. మొత్తం 42,439 మంది విద్యార్థులు ఉండగా అందులో 21,624 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 20815 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సర విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరి కోసం 67 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. వీటిలో కంభం, పెద్దదోర్నాల, అర్థవీడు, యర్రగొండపాలెం, గిద్దలూరు లోని కళాశాలలను సున్నితమైనవిగా గుర్తించామని, ఈ ఐదు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, ఉదయం 8:30 గంటలకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారన్నారు. పరీక్ష 9 గంటలకు ప్రారంభం తర్వాత ఎవరు వచ్చినా అనుమతించరని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు 67 మంది చీఫ్ సూపరింటెండెంట్, 67 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 1089 మంది ఇన్విజిలేటర్లను నియమించామని చెప్పారు. ఈ పరీక్షల్లో కాపీయింగ్ నిరోధించేందుకు మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశామని, వీరికి తోడు ఆర్.ఐ.ఓ, డీఈసీ సభ్యులు, స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్, రెవెన్యూ అధికారులు, రాష్ట్ర స్థాయి బోర్డు అధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారన్నారు.
వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్:
పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరికీ హాల్‌టికెట్లు జారీ చేయాల్సిందేనని, ఎవరైనా ట్యూషన్ ఫీజు చెల్లించలేదని కారణాలతో హాల్ టికెట్లు నిరాకరిస్తే అటువంటి కళాశాల గుర్తింపు రద్దు చేస్తామని ఆర్‌ఐఓ హెచ్చరించారు. విద్యార్థులు కళాశాలలతో నిమిత్తం లేకుండా నేరుగా ఇంటర్నెట్ సెంటర్ నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చన్నారు. హాల్ టికెట్ పై తమ కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదన్నారు. అంతే కాకుండా కొత్తగా ప్రవేశపెట్టిన వాట్స్‌యాప్ సర్వీస్ శ్రీమన మిత్ఙ్ర ద్వారా కూడా హాల్ టికెట్ లను పొందవచ్చన్నారు. ఈ సర్వీసు కోసం రిజిస్టర్ నంబర్ 9552300009 కు ‘హాయ్’ అనే సందేశాన్ని పంపి విద్యార్థి పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ సహాయంతో సులభంగా విద్యార్థి హాల్ టికెట్‌ను పొందవచ్చని చెప్పారు.
సీసీ కెమెరాలు అనుసంధానం:
ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల పటిష్ట నిఘాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగనున్నట్లు ఆర్‌ఐవో తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోని అన్ని గదులకు, ప్రధాన ప్రవేశ ద్వారం, ప్రశ్నపత్రాల బండిల్స్ ఓపెన్ చేసే గది, జవాబు పత్రాలు ప్యాక్ చేసే గదితో సహా మొత్తం సీసీ కెమెరాలు బిగించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో ఏం జరుగుతుందని ప్రత్యక్షంగా చూసేందుకు వీలుగా ఒంగోలు లోని ఆర్.ఐ.ఓ కార్యాలయానికి, విజయవాడలోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయానికి సీసీ కెమెరాలు అనుసంధానించామన్నారు.
పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు నిషిద్ధం
విద్యార్థులు ఎవరూ పరీక్ష కేంద్రానికి స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్‌లు తీసుకొని రాకూడదని ఆర్‌ఐఓ చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్ తో పాటు కేంద్రంలో పని చేసే సిబ్బంది ఎవరూ మొబైల్ ఫోన్ తీసుకురాకూడదన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశారని, అవసరమైన చోట్ల ఇతర కళాశాలల నుంచి ఫర్నిచర్ కూడా తెప్పించినట్లు చెప్పారు. ఆర్టీసీ వారి సహకారంతో పరీక్ష కేంద్రాలు దూరంగా ఉన్న చోట్లకు బస్సులు నడుపుతారన్నారు. పరీక్ష కేంద్రంలో ఎవరైనా అస్వస్థత చెందితే వారికి ప్రాథమిక చికిత్స అందించేందుకు ఒక ఆరోగ్య కార్యకర్త, ఏఎన్‌ఎంను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రానికి చుట్టూ 144వ సెక్షన్ ఏర్పాటు చేశారని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేసేందుకు ఆదేశాలు ఇచ్చారన్నారు.
విధుల్లో ఉండే వారికి ఐడీ తప్పనిసరి:
పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ప్రతి ఒక్కరూ వారి ఐడెంటిటీ కార్డును ధరించాలని ఆర్‌ఐఓ తెలిపారు. పరీక్షల సమయంలో తప్పుడు ప్రచారాలు వ్యాపింప చేసినా, తప్పుడు మార్గాలను అన్వేషించి వాటికోసం పాకులాడినా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారన్నారు. ఇందుకోసం పోలీస్ శాఖ ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వాటిని జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నంబర్ 08592–281275 ను సంప్రదించవలసినదిగా కోరారు.
నిఘానేత్రాల నీడలో ఇంటర్మీడియెట్ పరీక్షలు
ఆర్‌ఐఓ సైమన్ విక్టర్
Comments
Please login to add a commentAdd a comment