
పుణ్యఫలం
ఉపవాసం...
● నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ● ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో ప్రారంభమైన రంజాన్ మాసం ● ఉపవాస దీక్షలకు సరంజామా సిద్ధం చేసుకుంటున్న ముస్లింలు ● ముస్తాబైన మసీదులు ● సహరీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ● అమ్మకాలకు సిద్ధమవుతున్న హలీం
నియ్యత్‌కి దువా
కనిగిరి రూరల్/కంభం: ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెల ప్రారంభమైంది. శనివారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్నట్లు మసీదుల్లోని మత పెద్దలు ప్రకటించారు. రంజాన్ నెల ప్రారంభ సూచికగా కొన్ని ప్రాంతాల్లో సైరన్ మోగించారు. శనివారం రాత్రి 9 గంటలకు మసీదుల్లో ప్రత్యేక నమాజ్ (తరావీహ్) చదివారు. ముస్లింలు ఒకరికొకరు ‘చాంద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉపవాసాలకు ముస్లింలు సరంజామా సిద్ధం చేసుకున్నారు. ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో రంజాన్ మాస సందడి ప్రారంభమైంది. ‘రంజాన్ నెలలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి.. సైతాన్ బంధితుడు అవుతాడు’.. అనే మొహమ్మద్ ప్రవక్త ప్రవచనానికి అనుగుణంగా ముస్లింలు ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరచుకుంటారు. ఆదివారం ఉదయం 5–08 గంటలకు సహార్ (ఉపవాస దీక్ష ప్రారంభం), సాయంత్రం 6.25 గంటలకు ఇఫ్తార్ (ఉపవాస దీక్ష విరమించడం) జరుగుతుంది.
రంజాన్ అనేది ఒక మాసం (నెల) పేరు. ఉర్దూలో రంజ్ అనగా దహించేదని, ఆన్ అంటే నెల అని అర్థం. మనషుల పాపాలన్నీ ఉపవాసాలతో, దానాలతో దహిస్తాయి. అందువలన రంజాన్ అనే పేరు వచ్చింది. ఈ మాసంలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించింది. రంజాన్ నెలలో ఖురాన్ చదివితే మరింత పుణ్యం లభిస్తుందని మత పెద్దలు చెబుతారు. ముస్లింలకు అత్యంత ముఖ్యమైన మాసం రంజాన్. ఈ నెలలో ముస్లింలు ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. రంజాన్ మాసంలో ముస్లింలలో భక్తిభావం ఉప్పోంగుతుంది. ధార్మిక చింతన, ప్రేమ, సౌభ్రాతృత్వం, దానగుణం, క్రమశిక్షణ, పరోపకారం తదితర నియమాలను ముస్లింలు పాటిస్తారు. రంజాన్ నెలలో అత్యంత నిష్టగా జరుపుకునే రోజు షబ్–ఏ–ఖదర్. దీని తర్వాత మూడు రోజులకు రంజాన్ పండుగ చేస్తారు. ఆదివారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది.
జిల్లాలో సుమారు 270 మసీదులు...
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ముస్లిం జనాభా ఒంగోలు, కనిగిరి, కందుకూరు, పొదిలి, మార్కాపురం, కంభం, గిద్దలూరు, పర్చూరు ప్రాంతాల్లో ఉంది. ప్రస్తుతం జిల్లాలోని మున్సిపాలిటీల్లో అత్యధికంగా కనిగిరిలో ముస్లింలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలున్నాయి. జిల్లాలో సుమారు 270 వరకు మసీదులున్నట్లు సమాచారం. ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే 65 వరకు మసీదులున్నాయి. జిల్లాలోని మసీదులన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పలుచోట్ల రంజాన్ మాసం ప్రారంభ సూచికగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ముస్లింలు అధికంగా ఉండే ఏరియాల్లో తోరణాలు, ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నాయి.
రోజా (ఉపవాస దీక్షలు)...
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి ఆహార పానియాలు ముట్టకుండా (కఠోర దీక్ష) ఉపవాసాన్ని పాటిస్తారు. కనీసం లాలాజలం కూడా మింగరు. అత్యంత నిష్టతో ఉపవాసాన్ని (రోజాను) ఆచరిస్తారు. సూర్యోదయంకు ముందు సహార్ అని, సూర్యాస్తమయం తర్వతా ఇఫ్తార్ అని పిలుస్తారు. రోజా ఉండేవారు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఏదైన ఫలాహారాలు తీసుకుంటారు. రోజుకు కనీసం 13 గంటలు ఉమ్మి కూడా మింగకుండా కఠోర దీక్షలు ఆచరిస్తారు. రోజా పాటించేవారు మనస్సును భగవంతునిపై లగ్నం చేసి చెడు ఆలోచనలకు దూరంగా ఉంటారు. సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని మసీదుల్లో, దైవ ధ్యానంలో గడుపుతారు. ఈ దీక్షల వల్ల మానవునిలో భగవంతుని పట్ల భక్తి, నమ్మకం, విశ్వాసం, భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అనే భావం పెంపొందుతాయి.
ఏహ్ తే కాఫ్...
ఈ మాసంలో 21వ రోజు నుంచి నెల చివరి వరకు (తపోనిష్టతో) ఏహ్ తే కాఫ్ కూర్చుంటారు. ఈ ఏహ్ తే కాఫ్ పాటించే వారు మసీదులోనే పూర్తి సమయాన్ని గడపుతూ ప్రార్థనల్లో దివ్య ఖురాన్ (దైవ గ్రంథాలు) చదువుతూ ఉపవాస దీక్షలో నిమగ్నమవుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మసీదు నుంచి బయటకు అడుగుపెడతారు.
జకాత్...
ముస్లింలలో మరీ ముఖ్యమైన సంప్రదాయం జకాత్. ప్రతి వ్యక్తి తన లాభార్జనలో కొంత మేర నిరుపేదలకు దానధర్మాలు చేయడాన్ని జకాత్‌గా పిలుస్తారు. ప్రతి మనిషి తనలాగే ఉన్నతుడు కావాలని కోరుకోవడం ఈ జకాత్ ప్రధాన ఉద్దేశం. జకాత్ నిధితో నిరుపేదలకు వస్తువుల రూపంలోగానీ, నగదు రూపంలోగానీ దానం చేస్తారు. అయితే దానస్వీకర్తల పేర్లను గోప్యంగా ఉంచడమే దీని ప్రధాన నియమం. రంజాన్ నెలలోనే జకాత్ ఇస్తారు.
ఫిత్రా...
రంజాన్ మాసం చివరిరోజున జరుపుకునే పర్వదినం రంజాన్ (ఈద్–ఉల్–ఫితర్). దేవుని అనుగ్రహం కోసం, కృతజ్ఞతగా నిరుపేదలకు ఫిత్రా (దానం) ఇస్తారు. ప్రతిఒక్కరూ కనీసం రెండు కిలోల గోధుమలు లేదా దానికి సమానమైన ఇతర ఆహార ధాన్యాలు లేదా నగదు దానం చేస్తారు. రంజాన్‌ను ప్రతి ముస్లిం లోటులేకుండా సంతోషంగా జరుపుకునేందుకు చేయాల్సిన దానధర్మాలను ఇస్లాం మతం ఉద్భోదిస్తుంది.
ఇఫ్తార్ ప్రత్యేకత...
రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసదీక్ష విరమింపజేసే కార్యక్రమాన్నే ఇఫ్తార్ అంటారు. ఇఫ్తార్ సమయంలో తీసుకునే ఆహారాన్ని దీక్ష వాసులకు అందించడం కూడా పుణ్యకార్యంగా భావిస్తారు. ఇఫ్తార్ విందులను ముస్లింలే కాకుండా ఇతరులు కూడా రోజా ఆచరించిన వారికి ఇస్తారు.
తరావీహ్ నమాజ్...
ముస్లింలు ప్రతిరోజూ 5 సార్లు నమాజు (ఉదయం ఫజర్, మధ్యాహ్నం జోహర్, సాయంత్రం 5 గంటలకు అసర్, రాత్రి 6.30 గంటలకు మగ్‌రీబ్, రాత్రి 8 గంటలకు ఇషా నమాజ్) చేస్తారు. అయితే, రంజాన్ నెలలో ఇషా నమాజ్ తర్వాత ప్రత్యేకంగా ఎంతో నిష్టతో మరో 20 రకాత్‌లు ‘తరావీహ్’ నమాజ్ చేస్తారు. రంజాన్ మాసంలో తరావీహ్ నమాజ్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది.
షబ్ ఏ ఖద్ర్...
రంజాన్ మాసంలో ఆచరించాల్సిన మరో అంశం షబ్ ఏ ఖద్ర్. ఆకాశ గ్రంథమైన దివ్యఖురాన్ రంజాన్ మాసంలో షబ్ ఏ ఖద్ర్ రోజున అవతరించింది. చివరి పదిరోజుల్లో 21, 23, 25, 27, 29వ బేసి రాత్రుల్లో ఏదో ఒక రాత్రి షబ్ ఏ ఖద్ర్ ఉంటుంది.
కంభం పట్టణంలోని జమియా మసీదు
30 రోజుల పాటు మసీద్ వద్ద సహారి ఏర్పాట్లు...
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఆచరించే వారి కోసం 30 రోజుల పాటు కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ (ఛోటి మసీద్)లో యువత సహారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం సహారి (ఉపవాసం ఆచరించే వారు ఉదయాన్నే తినే ఆహారం) మసీదులోనే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముస్లిం యూత్ కమిటీలు టీంలుగా ఏర్పడి ఒక్కోరోజు కేటాయించుకున్నారు. వారికి కేటాయించిన తేదీల్లో ఉదయాన్నే రోజా ఆచరించే వారికి ఇఫ్తార్ సౌకర్యం కల్పిస్తారు. దీంతో రోజా ఆచరించే వారు మసీద్ వద్దకు వచ్చి సహారీ చేసుకుంటారు. దీన్ని ఎంతో సేవ, పుణ్యకార్యంగా భావిస్తారు.
కంభం పట్టణంలో...
కంభం పట్టణంలోని జామియా మసీదు, రైల్వేస్టేషన్ సమీపంలోని నూర్ మక్కా మసీదులో రంజాన్ నెల మొత్తం ఉపవాసదీక్షలు ఉండే వారి కోసం సహారీ ఏర్పాట్లు చేశారు. సహారీలో యువకులు ఉత్సాహంగా పాల్గొని మసీదుల్లో భోజనాలు తయారు చేసుకుని ఉపవాస దీక్షలు ఉంటారు. రైలు ప్రయాణానికి వెళ్లే వారు మసీదులో సహారీ చేసుకుని వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది.
రోజెకి నియ్యత్: అల్లాహుమ్మా అసూముగదన్ లక ఫగ్ ఫిర్లీ మాఖద్దమ్‌తు వమా అఖ్ఖర్తు..
ఉదయం సహార్ (ఉపవాసం ప్రారంభించేటప్పుడు) చేసే సమయంలో చేసే దువా..
ఇఫ్తార్‌కి దువా: అల్లాహుమ్మ లక సుమ్తు వఫిక ఆమన్‌తు వఅలైక తవక్కల్తు అలారిజ్ ఖిక అఫ్తర్తు ఫత ఖిబ్బల్ మిన్నీ..
సాయంత్రం ఇఫ్తార్ (ఉపవాస దీక్ష విరమించే) సమయంలో చేసే దువా..

పుణ్యఫలం

పుణ్యఫలం
Comments
Please login to add a commentAdd a comment