
గుడిలో, ఇంట్లో చోరీ
● సుమారు 10 సవర్ల బంగారం, రూ.1.80 లక్షల నగదు అపహరణ
సింగరాయకొండ: ఒకేరోజు గుడిలో, ఇంట్లో జరిగిన వేర్వేరు చోరీల్లో సుమారు 10 సవర్ల బంగారం, రూ.1.80 లక్షల నగదు అపహరణకు గురైంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. సింగరాయకొండ మండల కేంద్రంలోని మినీబైపాస్‌లో అరుణకాలనీ మొదటిలైనులో నివసిస్తున్న మలినేని ఇందిర జాతీయ రహదారిపై విమానాల రన్‌వే వద్ద హోటల్ నిర్వహిస్తోంది. శుక్రవారం రాత్రి హోటల్ వద్దే ఉండి శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గమనించి చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. మూడు సవర్ల బంగారం, రూ.1.80 లక్షల నగదు చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ఘటనకు సంబంధించి.. మూలగుంటపాడు పంచాయతీ కార్యాలయం సమీపంలోని తిరుపతమ్మ గుడిలో చోరీ జరిగింది. ఆలయంలో 15 రోజుల క్రితం అమ్మవారి నూతన విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. శనివారం 16 రోజుల పండుగ నిర్వహించాల్సి ఉంది. అందుకోసం అమ్మవారి విగ్రహానికి సుమారు 7 సవర్ల బంగారం వస్తువులైన మంగళసూత్రం, చెవి కమ్మలు, బొట్టు, ముక్కుపుడక అలాగే ఉంచారు. రాత్రి సుమారు ఒంటిగంట వరకు పూజలు కూడా జరిగాయి. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య చోరీ జరిగింది. ఆలయంలో హుండీ కూడా తొలగించారని, కానీ, హుండీలో కేవలం రూ.300లోపే నగదు ఉంటుందని, విలువైన బంగారం చోరీ జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ రెండు చోరీలకు సంబంధించి క్లూస్ టీం సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై బి.మహీంద్ర తెలిపారు.
కోర్టు పనులను పరిశీలించిన హైకోర్టు జడ్జి
సింగరాయకొండ: స్థానిక మండల కాంప్లెక్స్‌లో నూతనంగా నిర్మిస్తున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పనులను హైకోర్టు జడ్జి కె.మన్మథరావు శనివారం పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. మార్చి 15వ తేదీకల్లా భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. అడ్వకేట్లు రాయి రమేష్, సన్నెబోయిన శ్రీనివాసులు, తహసీల్దార్ టి.రవి, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలోని పోలీసుస్టేషన్లలో ఓపెన్ హౌస్
ఒంగోలు టౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పోలీసు స్టేషన్లలో శనివారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్లను సందర్శించిన మహిళలు, విద్యార్థినులకు పోలీసు స్టేషన్ల పనితీరు, మహిళా సహాయక కేంద్రంపై అవగాహన, పోలీసు స్టేషన్లలో ఉపయోగించే పరికరాలు, రికార్డుల నిర్వహణ, తదితర విషయాలను వివరించారు. మహిళా చట్టాలు, పోక్సో చట్టం, ఈవ్‌టీజింగ్, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించారు. మానసికంగా, శారీరకంగా ద్రుఢంగా ఉన్నప్పుడే స్వీయ రక్షణ సాధ్యమవుతుందన్నారు. బాలికలు చదవుకుని సమాజానికి, తల్లిదండ్రులకు ఉపయోగపడాలని సూచించారు. అత్యవసర సమయంలో సహాయం కోసం చైల్డ్ హెల్ప్ నంబర్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీసు హెల్ప్ లైన్ 100, 112, సైబర్ క్రైం నంబర్ 1930, పోలీసు కంట్రోలు రూం నంబర్ 9121102266కు ఫోన్ చేయాలని పోలీసు అధికారులు సూచించారు.
పలకల గోడౌన్‌లో అగ్నిప్రమాదం
మార్కాపురం: పట్టణ శివార్లలోని ఎస్టేట్‌లో ఉన్న పలకల గోడౌన్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.2 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్టేట్‌లోని చిలకపాటి లింగమయ్యకు చెందిన వేస్టేజీ ప్లాస్టిక్ గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న సామగ్రి కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలియజేయడంతో ఫైరింజన్‌తో వచ్చి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు.

గుడిలో, ఇంట్లో చోరీ

గుడిలో, ఇంట్లో చోరీ
Comments
Please login to add a commentAdd a comment